Gold Prices: అమ్మ బాబోయ్.. ఏకంగా రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర.. మరీ ఇంతలా..
ఇండియాలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనం కావడంతో పాటు పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా గోల్డ్ రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ వారం రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది. వారంలో ఎంత పెరిగిందనేది చూద్దాం.

బంగారం ధరలకు అసలు ఎక్కడా బ్రేకులు పడటం లేదు. రాకెట్ స్పీడ్‌లో రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. బంగారంతో పాటు వెండి కూడా దూసుకెళ్తుంది. బంగారం ధర ప్రస్తుతం తులం రూ.లక్షన్నరగా ఉండగా.. కేజీ వెండి సుమారు రూ.2లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా గోల్డ్ రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో పాటు పసిడిపై పెట్టుబడులు పెట్టడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కావడం ఇండియాలో గోల్డ్ రేట్ పెరగడానికి మరో కారణం అవుతుంది.
వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే..?
గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏకంగా రూ.3,760 పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర డిసెంబర్ 7న రూ.1,30,150గా నమోదవ్వగా.. 8వ తేదీన 1,30,420గా ఉంది. ఇక 9న రూ.1,29,440గా నమోద్వగా.. 10వ తేదీన రూ.1,30,310కు పెరిగింది. ఇక 11న రూ.1,30,750, 12న 1,34,180గా ఉంది. ఇక డిసెంబర్ 14కు రూ.1,33,910కు చేరుకుంది. అంటే వారంలో ఏకంగా రూ.3760 పెరిగిందన్నమాట.
22 క్యారెట్ల బంగారం ఇలా..
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం డిసెంబర్ 7న రూ.1,19,300, 8వ తేదీన రూ.1,18,650, 12వ తేదీన రూ.1,23,000గా నమోదైంది. ఇక వారంతరంలో రూ.1,22,750కి చేరుకోగా.. మొత్తం రూ.3450 పెరిగింది.




