AP Rains: ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. రానున్న రోజుల్లో మరో అల్పపీడన ‘గండం’.!
ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంద్ర మీదుగా కొనసాగుతోంది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
అమరావతి, జూలై 27: గత కొద్దిరోజులుగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆగష్టు 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాతే.. ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంద్ర మీదుగా కొనసాగుతోంది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించవచ్చునని.. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రదేశాలను చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.