Andhra: పెట్టిన గుడ్లను పొదిగిన నాటు కోడి.. అందులో ఒక పిల్లని చూడగా ఆశ్చర్యం..
సృష్టిలో అప్పుడప్పుడూ ప్రకృతి ఆశ్చర్యపరిచే దృశ్యాలు చూపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు కాళ్లతో జన్మించిన కోడిపిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.పెడ బూరుగుపుట్టులో చోటుచేసుకున్న ఈ వింత ఘటన చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ...

సృష్టిలో కొన్ని సార్లు విచిత్ర ఘటనలు.. ప్రకృతి విరుద్ధంగా జరిగిన కొన్ని సంఘటనల గురించి వింటూ ఉంటాం. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. కోడికి పొదిగిన గుడ్ల నుంచి జీవం పోసుకున్న పిల్ల విచిత్రంగా కనిపించింది. రెండు కాళ్లు ఉండాల్సిన కోడిపిల్లకి.. నాలుగు కాళ్లు ఉండటం ఆశ్చర్యపరిచింది. ఈ వింత ఘటన గురించి.. ఆ నోట ఈ నోట పాకడంతో జనం ఆ కోడి పిల్లలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
అల్లూరి జిల్లాహుకుంపేట మండలం పెద బూరుగుపుట్టులో ఈ విచిత్ర వింత ఘటన చోటుచేసుకుంది. కిల్లో అప్పారావు అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న నాటుకోడిని గుడ్లపై పొదిగించాడు. ఆ కోడి గుడ్ల నుంచి నాలుగు కోడి పిల్లలు పెరిగాయి. వాటిలో ఒకటి విచిత్రంగా కనిపించింది. కాస్త.. దగ్గరగా వెళ్లి చూస్తే ఆ కోడి పిల్లకు నాలుగు కాళ్లు కనిపించాయి. అప్పారావుకు ఈ దృశ్యం చూసి వింతగా అనిపించింది. ప్రస్తుతం ఆ కోడి పిల్ల ఆరోగ్యంగానే ఉంది. నాలుగు కాళ్లతో జన్మించిన ఈ కోడిపిల్ల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు.. చూసేందుకు విచిత్రంగా ఉందంటూ చర్చించుకుంటున్నారు. అయితే.. గతంలోనూ కొన్ని చోట్ల ఇటువంటి నాలుగు కాళ్లతో కోడి పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. జన్యు లోపంతో ఇలా నాలుగు కాళ్లతో కోడి పిల్లలు పుడుతూ ఉంటాయని అంటున్నారు వెటర్నరీ వైద్యులు.




