IND vs SA 3rd T20 : టీమిండియా సునామీ.. సౌతాఫ్రికాపై ఘన విజయం.. సిరీస్‌లో భారత్‌కు ఆధిక్యం
IND vs SA 3rd T20 : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

IND vs SA 3rd T20 : ధర్మశాలలో జరిగిన భారత్, సౌతాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సంపాదించింది. భారత బౌలర్లు సౌతాఫ్రికాను కట్టడి చేయగా, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడి లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆట మొదలైంది. ఈ కీలక మ్యాచ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ తమ జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు బదులుగా హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం ఇచ్చింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. అర్ష్‌దీప్ సింగ్, కొత్తగా జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్‌ను కూల్చారు.. దీంతో ఆ జట్టు 3 వికెట్లకు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి, టీ20ఐలలో 100 వికెట్ల మార్కును పూర్తి చేసుకుని, 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాత్రమే నిలకడగా ఆడి, 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. డోనోవన్ ఫెరీరా (20) కొంత సహకరించినా, మిగిలిన ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ చేశారు.
118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ధాటిగా ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని అందించాడు. అతను శుభ్‌మన్ గిల్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ 28 బంతుల్లో 28 పరుగులు చేసి నిలకడ ప్రదర్శించాడు. లక్ష్యం వైపు దూసుకుపోతున్న భారత్‌కు 12వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ (28) అవుటవ్వడం ద్వారా రెండో వికెట్ పడింది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత జట్టు 14 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది, అప్పటికి గెలుపుకు కేవలం 17 పరుగులు మాత్రమే అవసరం. అయితే 15వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (12 పరుగులు) వరుసగా రెండు ఫోర్లు కొట్టిన తర్వాత, భారీ షాట్ ఆడబోయి బార్ట్‌మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శివమ్ డూబే, తిలక్ వర్మ (25 నాటౌట్)తో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. శివమ్ డూబే (10 నాటౌట్) బార్ట్‌మ్యాన్ వేసిన బౌలింగ్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి భారత్‌కు ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌లో ముందుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




