IND vs SA : ఈ ఫైర్ ఇన్నాళ్లు ఎక్కడ దాచారయ్యా.. రాణించిన బౌలర్లు.. 117కే సౌతాఫ్రికా ఆలౌట్
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత బౌలర్లు తమ ప్రతాపం చూపించారు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత బౌలర్లు తమ ప్రతాపం చూపించారు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు కీలక మార్పులతో దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు బదులుగా యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం దక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ మొదటి ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్‌ను అవుట్ చేయగా, ఆ తర్వాత హర్షిత్ రాణా గత మ్యాచ్‌లో బాగా ఆడిన క్వింటన్ డి కాక్‌ను, డెవాల్డ్ బ్రెవిస్‌ను వెంటవెంటనే పెవిలియన్ పంపాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా కేవలం 3 వికెట్లకు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. 11వ ఓవర్‌లో శివమ్ దూబే, కార్బిన్ బాష్ వికెట్ తీయడంతో 50 పరుగులు దాటకుండానే సగం జట్టు అవుటైంది.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో చరిత్ర సృష్టించాడు. 7వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (9 పరుగులు) వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన 100వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికే 100 సిక్సర్లు కొట్టిన హార్దిక్, ఈ అరుదైన 100/100 డబుల్ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ మాత్రం క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. వరుణ్ చక్రవర్తి తన స్పిన్‌తో డోనోవన్ ఫెరీరా (20), మార్కో జాన్సెన్‌ల వికెట్లను తీశాడు.
కెప్టెన్ మార్కరమ్ మాత్రం ధాటిగా ఆడి, 41 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్‌లో హర్షిత్ రాణాపై రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించాడు. అయితే 19వ ఓవర్‌లో మార్కరమ్ 61 పరుగుల వద్ద అర్ష్‌దీప్ సింగ్‌కు చిక్కడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. చివరికి, సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించడానికి టీమిండియా ముందు ఇప్పుడు 118 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




