Andhra Pradesh: తెల్లవారుజామున రోడ్డు పక్కన పడి ఉన్న వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూడగా!
సాయంత్రం గ్రామంలో తోటి యువకులతో సరదాగ తిరుగుతూ కనిపించాడు ఆ యువకుడు. తెల్లవారు జామున రోడ్డు పక్కన శవమై కనిపించాడు. రాత్రి ఇంటికి రాకుండా ఆ యువకుడు ఎక్కడికి వెళ్లాడో.. ఏం జరిగిందో.. తెలియక తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తెల్లవారుజామున ఊరి జనాలు పనులు చేసుకుంటూ ఉండగా రోడ్డు పక్కన..

కొత్తూరు, జులై 7: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసప గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన యువకుడు మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మృతుడు అదే గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (20)గా గుర్తించి గ్రామంలోని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడి ఒంటి పై షర్ట్ లేదు. కేవలం ఫ్యాంట్‌తో మాత్రమే మృతదేహం పడి ఉంది. యువకుడి తల వెనుక భాగంలో దేనితోనో కొట్టినట్టు బలమైన గాయాలు ఉన్నాయి. దీంతో యువకుడిది హత్యగానే పోలిసులు భావిస్తున్నారు. వేరే చోట యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలిసులు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. యువకుడు మిన్నారావు శనివారం సాయంత్రం 7గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్ళాడని రాత్రి 9 గంటల వరకు గ్రామంలో తిరుగుతూ స్థానికులకు కనిపించాడని మృతుడు తండ్రి బుడ్డుడు చెబుతున్నారు.తమ కుమారుడు ఇంటికి వస్తాడని రాత్రంతా ఎదురు చూసామని కానీ రాలేదని తెల్లవారుజామున రోడ్డు పక్కన శవమై కనిపించాడని విలపిస్తున్నాడు. మృతుడు తల్లి సైతం కుమారుడి మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. తమ బిడ్డను కడుపున పెట్టుకున్నవారికి తమలాంటి కడుపుకోతే వస్తాదని శాపనార్థాలు పెడుతోంది.
యువకుడి దారుణ హత్య మండలంలో సంచలనం రేపుతుంది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిఉండవచ్చన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మిన్నారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కొత్తూరు హాస్పిటల్ కి తరలించారు. యువకుడు హత్యకు కారణాలు ఏంటి? హంతకులు ఎవరు అన్నదానిపై పోలిసులు అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అనేది ఆరా తీస్తూ వారిని విచారిస్తున్నారు. ఏడవ తరగతి వరకు చదువుకున్న మిన్నారావు.. తన తల్లిదండ్రులతోపాటు గ్రామంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. మిన్నారావు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.