AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడిన పాలవలస జంట హత్యల మిస్టరీ.. వెలుగులోకి ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ!

ఉపాధి నిమిత్తం భర్త సౌదీకి వెళ్లగా.. భార్య స్వయానా ఆడపడుచు భర్తతో నడిపిన వ్యవహారం ఇద్దరి హత్యకు దారి తీసింది. వీరిని కనిపెట్టిన ఎదురింటి వ్యక్తిని తొలుత అడ్డు తొలగించారు. అనంతరం హత్య చేసిన విషయం పోలీసులకు చెబుతానని సదరు మహిళ ఆడపడుచు భర్తను బ్లాక్ మెయిల్ చేయడంతో.. ఆమెనూ హత మార్చాడు..

వీడిన పాలవలస జంట హత్యల మిస్టరీ.. వెలుగులోకి ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ!
Palavalasa Double Murder Case
Srilakshmi C
|

Updated on: Jul 05, 2025 | 8:05 PM

Share

శ్రీకాకుళం, జులై 5: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసకు చెందిన డబుల్ మర్డర్ కేసులను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పాలవలసలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉండే గోకర్ల ఈశ్వరరావు, గోకర్ల రాజేశ్వరిలను పలాస మండలం మహదేవుపురంకి చెందిన మడియా రామారావు (37) అనే వ్యక్తి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు రామారావుని అరెస్ట్ చేసారు. హంతకుడు రామారావు… మృతురాలు రాజేశ్వరికి స్వయాన ఆడపడుచు భర్త కావడం విశేషం. అక్రమ సంబంధమే హత్యలకు అసలు కారణంగా పోలిసుల విచారణలో తేలింది. రాజేశ్వరి భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో ఉంటుండటంతో ఆమె అవసరాలు తీరుస్తూ ఆమెతో ఆడపడుచు భర్త రామారావు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

రామారావు, రాజేశ్వరిల అక్రమ సంబంధం తెలుసుకొన్న ఎదురింట్లో ఉండే ఈశ్వరరావు ఆమెను లొంగదీసుకున్నాడు. రాజేశ్వరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయం రామారావు తెలుసుకున్నాడు. దీంతో అక్కసుతో మే 17న గోకర్ల ఈశ్వరరావును పాలవలసలో జీడి తోటలోకి తీసుకెళ్లిన రామారావు.. అక్కడ మద్యం సేవించి బీర్ బాటిల్‌తో అతడిని కొట్టి హత్య చేశాడు. ఈశ్వరరావుని తానే హత్య చేసినట్లు రాజేశ్వరికి.. రామారావు వివరంగా చెప్పాడు. ఆ తర్వాత నుంచి తన అవసరాలకు డబ్బులు కావాలని, లేదంటే ఈశ్వరరావు హత్య విషయం బయట పెట్టేస్తానంటూ రామారావును రాజేశ్వరి బ్లాక్‌ మెయిల్‌ చేయసాగింది.

రాజేశ్వరి వేధింపులు భరించలేక జూన్ 11న మందస మండలం పితాలి వద్ద జీడి తోటల్లోకి బైక్ పై రాజేశ్వరిని తీసుకెళ్లిన రామారావు ఆమెను హత మార్చేందుకు పథకం పన్నాడు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. అనంతరం చున్నీతో ఆమె గొంతు బిగించి, హత్య చేశాడు. హత్య అనంతరం ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలతో రామారావు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామారావుపై అనుమానంతో నిఘా ఉంచగా.. ఎట్టకేలకు గురువారం అతన్ని అరెస్టు చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను పలాస DSP వెంకట అప్పారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.