ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా.. అసలేం జరిగిందంటే..?
ఒకవైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం.. మరోవైపు సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వార్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారా? ఆయన స్థానంలో ఏఐ సృష్టించిన మనిషి మాట్లాడుతున్నారా? ఆరు వేళ్లతో కనిపిస్తున్న ఆ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిటి? టెక్నాలజీతో ఆడుతున్న ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెను తుఫాను సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ప్రస్తుతం కనిపిస్తున్నది ఆయన ఏఐ రూపమని వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. అయితే ఈ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. నెతన్యాహు మరణ వార్త మొదట ఇజ్రాయెల్ ప్రధాని అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చినట్లుగా కొన్ని స్క్రీన్‌షాట్‌లు వైరల్ అయ్యాయి. ఆ పోస్ట్‌ను పెట్టిన కొద్దిసేపటికే తొలగించారని, నెతన్యాహుకు ఏదో జరిగిందని నెటిజన్లు ఊహించుకున్నారు. కానీ విశ్లేషణలో ఆ స్క్రీన్‌షాట్ పూర్తిగా ఫేక్ అని తేలింది. అధికారిక ఖాతా నుండి అలాంటి సందేశం ఎప్పుడూ రాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆరు వేళ్ల వివాదం.. ఏఐ వీడియోనా?
నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఒక వీడియోలో ఆయనకు ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో అది కృత్రిమ మేధస్సు సృష్టించిన వీడియో అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సాధారణంగా ఏఐ చిత్రాల్లో చేతి వేళ్ల విషయంలో కొన్ని లోపాలు దొర్లుతుంటాయి. దాన్నే ఆధారంగా చేసుకుని ఈ పుకారును వ్యాప్తి చేశారు. అయితే ఫ్యాక్ట్ చెకర్ల పరిశీలనలో అది కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ అని తేలింది. నెతన్యాహు మాట్లాడుతున్నప్పుడు చేయి కదిపిన కోణం, ఆ సమయంలోని మోషన్ బ్లర్ వల్ల ఒక వేలు అదనంగా ఉన్నట్లు అనిపించింది తప్ప, అది ఏఐ సృష్టించిన వీడియో కాదు.
ఇరాన్ లక్ష్యం నెతన్యాహు కుటుంబమేనా?
ఇరాన్ జరిపిన దాడుల్లో నెతన్యాహు లేదా ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారని వస్తున్న వార్తలను ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇరాన్ సాగిస్తున్న మైండ్ గేమ్‌లో భాగంగానే ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టుకొస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ చాట్‌బాట్ గ్రోక్ సైతం నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని, ఆయన నిరంతరం రక్షణ చర్చల్లో పాల్గొంటున్నారని నిర్ధారించింది.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బెంజమిన్ నెతన్యాహు సజీవంగా ఉన్నారు. ఆయన ఇజ్రాయెల్‌లోనే ఉంటూ సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం వంటి ఉద్విగ్న పరిస్థితుల్లో వచ్చే వైరల్ పోస్టులను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక వార్తా సంస్థల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఫ్యాక్ట్ చెకర్లు కోరుతున్నారు.
