AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: దంచికొడుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో బయట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక ఎండతో పాటు వడగాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కబోతతో అవస్థలు పడుతున్నారు. ఈ వారంలో ఎండలు మరింత పెరగనున్నాయి.

Weather Report: దంచికొడుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
India Heatwave Alert
Venkatrao Lella
|

Updated on: Apr 15, 2026 | 7:06 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు వాతావరణశాఖ మరోసారి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని, 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. వాతావరణశాఖ వెల్లడించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ నెల 18 వరకు వడగాల్పులు

ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 4, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు రాష్ట్ర ప్రజలకు సూచించారు. అటు మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రంలోని 262 మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ నెల 18వ తేదీ వరకు వడగాల్పులు కొనసాగుతాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఇక తెలంగాణలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 43 డిగ్రీలను దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక మంగళవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 43 డిగ్రీలు దాటాయి. రాబోయే ఐద్రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు దాటే అవకాశముంది. మంగళవారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిజామాబాద్‌లో 43.3, ఆదిలాబాద్‌లో 43.2, సిద్దిపేటలో 42.9, కామారెడ్డిలో 42.8, కరీంనగర్‌లో 42.8, మంచిర్యాల 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తన రిపోర్టులో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 4 వరకు ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో అయితే బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టోపీ ధరించడం లేదా గొడుగు లాంటివి వాడటం చేయాలని చెబుతున్నారు.

Follow Us