Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వయాగ్రా… ఓపెన్‌ సేల్స్ – మరీ ఇలానా…?

ప్రిస్క్రిప్షన్ ఉందా..? కొన్ని మెడికల్ షాపుల్లో కొన్ని మందుల కోసం వెళితే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇది. నిద్ర పట్టడానికి వేసుకునే అవిల్ మందు బిళ్లలు కావాలన్నా డాక్టర్ రిఫర్ చేస్తేనే ఇస్తారు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీలో ఉంటేనే అమ్మాలి అనే నిబంధన కొన్ని షాపుల్లో తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ.. షెడ్యూల్డ్ హెచ్‌ కేటగిరికీ చెందిన రేరెస్ట్ మెడిసిన్.. వయాగ్రా.. ఇది మాత్రం అడిగిందే తడవుగా ఇచ్చేస్తున్నారు. ఏదో అర్బన్ ఏరియాస్‌లో, కాస్మొపొలిటన్ సెక్టార్స్‌లోనో కాదు.. ఉభయగోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో.

Andhra: వయాగ్రా... ఓపెన్‌ సేల్స్ - మరీ ఇలానా...?
Viagra
B Ravi Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 05, 2025 | 7:52 PM

Share

వయాగ్రా… ఓపెన్‌ సేల్స్. వినడానికి విచిత్రంగా ఉంది కదూ! లైంగిక పటుత్వం కోసం.. సుఖవంతమైన సంసారం కోసం అనే ట్యాగ్‌లైన్‌తో అమ్ముడయ్యే వయాగ్రా టాబ్లెట్ల అమ్మకం దందా… ఉభయ గోదావరి జిల్లాల్లో యధేచ్ఛగా జరిగిపోతోంది. ఒక్క వయాగ్రానే కాదు, గర్భ విచ్ఛిత్తి మందులు సైతం విచ్చలవిడి అమ్మేస్తున్నారు. ఏకంగా 30 మెడికల్ షాపుల్లో దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు… నిబంధనలకు విరుద్ధంగా సరఫరా ఔతున్న మెడిసిన్స్‌ని చూసి షాకయ్యారు. ఎలాంటి ‌బిల్లులూ లేకుండా వయాగ్రా కొంటూ, అమ్ముతున్న రాకెట్‌ గుట్టురట్టయింది.

అసలెలా బైటపడింది ఈ మందుల దందా..? ఎక్కడ తీగ లాగితే ఎక్కడ డొంక కదిలింది? జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ షేక్ అబిద్ అలీ… మెడికల్ షాపుల్లో రెగ్యులర్ చెకింగ్స్‌కి వెళ్లారు. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే గణేష్ అనే కుర్రాడు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. రాజమండ్రికి చెందిన గణేష్ కాల్‌ డేటా వెతికితే… 30కి పైగా షాపులతో అతడు టచ్‌లో ఉన్నట్టు తేలింది. మొదట్లో… బుట్టాయగూడెంలోని కార్తీకేయ మెడికల్స్, లక్ష్మీదుర్గ మెడికల్స్, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్స్‌ని సీజ్ చేశారు. వీళ్లను విచారించి పక్కా సమాచారం సేకరించి… మిగతా దుకాణాల మీద కూడా మెరుపుదాడులు చేయాల్నది డ్రగ్ కంట్రోల్ అధికారుల ఆలోచన.

వయాగ్రా… షెడ్యూల్డ్ H కేటగిరీకి చెందిన ట్యాబ్‌లెట్. కౌంటర్లో చెయ్యిపెట్టగానే ఇచ్చేసే రకం కాదు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌ నుంచి ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప అమ్మకూడదు. కానీ.. ఇతగాడు యధేచ్ఛగా షాపులకు సప్లయ్ చెయ్యడం.. ఆ షాపుల్లో అనాసిన్, పారాసెట్‌మాల్‌ అమ్మినంత ఈజీగా ఓపెన్‌ సేల్స్‌లో విచ్చలవిడిగా అమ్మెయ్యడం.. ఇదీ ఇక్కడ జరిగే దందా. అసలీ షెడ్యూల్డ్ H డ్రగ్ ఇంత సులభంగా వీళ్లకెలా చేరుతోందో ఆరా తీస్తే.. ఇదంతా ఒక సిండికేట్ బిజినెస్‌గా తేలింది.

హైదరాబాద్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి, లేదంటే హోల్‌సేల్ షాపుల నుంచి జీరో బిల్లుతో తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా గోదావరి జిల్లాల్లో విక్రయానికి పెట్టి.. స్థానికంగా జనాన్ని వయాగ్రాకు బానిసలుగా మార్చేస్తున్న వైనం ఇది. బ్లాక్‌లో అమ్మకం, బ్లాక్‌లోనే కొనుగోలు. అమ్మినట్లు, కొన్నట్లు ఏ రికార్డ్స్‌లోనూ ఉండదు. అంతా జీరో బిల్లు దందా. ఎవరికీ అనుమానం రాకుండా బైక్‌పై మందులను తరలిస్తున్న వీళ్ల మీద డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. పైగా.. అసలు ధరకంటే నాలుగురెట్లు ఎక్కువ చేసి అమ్మడం దోపిడీలో ఇంకో కోణం.

వీళ్ల దగ్గర వయాగ్రా కోసం ఎగబడే రెగ్యులర్ కస్టమర్లలో బీపీ, షుగర్ పేషెంట్లే ఎక్కువ. వివాహేతర సంబంధాలున్న కుర్రోళ్లు, కోరికలు ఎక్కువగా ఉండి వయసు సహకరించని వాళ్లు.. ఎక్‌ట్రా సామర్థ్యం కోసం వయాగ్రాను వెర్రిగా కొనుక్కుంటున్నారు. ఇల్లీగల్ ఎఫైర్స్‌ కారణంగా గర్భం తెచ్చుకుని.. ఆస్పత్రులకు వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకనుకునేవాళ్లకు చాటుమాటుగా గర్భ విచ్ఛిత్తి మందులు సైతం వీళ్ల దగ్గర దొరుకుతాయి. ఇంకా… మత్తు కోసం పిల్లలు ఎక్కువ వాడే ట్రమాడాల్ టాబ్లెట్లూ ప్రిస్క్రిప్షన్‌తో పన్లేకుండా అమ్మేస్తున్నారు.

నగర, పట్టణ ప్రాంతాలైతే అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది కనుక.. మారుమూల గ్రామాల్లోనే వయాగ్రా అమ్మకాలు ఎక్కువగా జరుపుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని మెడికల్ షాపుల్లో మాత్రమే సేల్స్‌కి సంబంధించి రికార్డులుంటాయి. అందుకే.. మిగతా దుకాణాల్నే ఈ ముఠా టార్గెట్ చేసుకుంది. ఇదే ముఠా ఇంకాస్త విస్తృతమై సిటీల్లోకి వెళితే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఇదే ప్రాంతంలో గతంలో కూడా వయాగ్రా అమ్మకాలు విచ్చలవిడి అమ్మకాలు జరిపినట్టు టీవీ9 నిఘాలో బైటపడింది. ఇప్పుడు అంతకుమించి షురూ ఔతోంది మందుబిళ్లల దందా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..