Volodymyr Zelenskyy: పుతిన్‌ను ఆయన అనుచరులే చంపేస్తారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రాణహాని ఉందా? ప్రధాన అనుచరులే పుతిన్‌ను చంపేయాలని చూస్తున్నారా?. అవుననే అంటున్నారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌. ఇది కచ్చితంగా జరిగి తీరుతుందంటూ జోస్యం చెప్పారు. అది జరిగిన రోజు నా మాటల్ని ఈ ప్రపంచం గుర్తుచేసుకుంటుందన్నారు జెలెన్‌స్కీ.

Volodymyr Zelenskyy: పుతిన్‌ను ఆయన అనుచరులే చంపేస్తారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..
Volodymyr Zelenskyy - Vladimir Putin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2023 | 6:56 AM

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగి ఏడాదైపోయింది. ఇప్పటికీ బాంబులతో విరుచుకుపడుతోంది రష్యా. అయినా కూడా దీటుగా ఎదుర్కొంటూ రష్యాకి ఎదురునిలబడింది ఉక్రెయిన్‌. భారీ విధ్వంసం, ఊహించని ప్రాణనష్టం జరుగుతున్నా అత్యంత శక్తివంతమైన దేశానికి ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైమ్‌లో ఊహించని యుద్ధతంత్రంతో అడుగులేస్తున్నారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ. రష్యాకి చైనా ఆయుధాలు సప్లై చేస్తోందన్న వార్తలతో జిన్‌పింగ్‌తో భేటీకావాలనుకుంటున్నానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి షాకిచ్చారు జెలెన్‌స్కీ. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి కోసం చైనా ప్రకటన రిలీజ్‌ చేసిన వెంటనే జెలెన్‌స్కీ ఈ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం సంచలనం రేపింది. ఇక, ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌ నైతిక స్థైర్యం దెబ్బతీసేలా సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేశారు జెలెన్‌స్కీ . సొంతవాళ్ల చేతుల్లో పుతిన్‌కి చావు తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదోఒకరోజు ఆయన అంతరంగికులే పుతిన్‌ను చంపడం ఖాయమన్నారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌-రష్యా వార్‌కి ఏడాదైన సందర్భంగా ప్రచురించిన కథనంలో వీటిని ప్రస్తావించింది న్యూస్‌ వీక్‌.

పుతిన్‌ నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. ఇక ఎన్నోరోజులు పుతిన్‌ ఆటలు సాగవన్నారు జెలెన్‌స్కీ. అతని సన్నిహితులే అతన్ని అంతమొందించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పుతిన్‌ పాలనపై అతని స్నేహితులే విసిగిపోయారని, అతడ్ని చంపేందుకు కారణాలు వెతికే పనిలో పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జెలెన్‌స్కీ. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది, కానీ ఎప్పుడంటే మాత్రం సమాధానం చెప్పలేనన్నారు. అయితే, అది జరిగిన రోజు నేను చెప్పిన మాటల్ని కచ్చితంగా ఈ ప్రపంచం గుర్తుచేసుకుంటుందన్నారు జెలెన్‌ష్కీ.

పుతిన్‌పై అతని అంతరింగీకుల్లోనే అసహనం పెరిగిపోతోందంటూ ది వాషింగ్టన్‌ పోస్ట్‌ సైతం కథనాలు ప్రచురించింది. పుతిన్‌ సన్నిహితులు, నేతలే కాదు రష్యన్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ నివేదికలను బయటపెట్టింది. ఇప్పుడు జెలెన్‌ష్కీ ఏకంగా ఆయన అనుచరులే పుతిన్‌ చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్‌. అయితే, స్వయంగా గూఢచారిగా పనిచేసిన పుతిన్‌ను చంపడం అంత ఈజీనా అంటే కానేకాదు. ఎందుకంటే, అమెరికా అంతటి శక్తివంతమైన దేశం రష్‌యా. పైగా పుతిన్‌ సెక్యూరిటీ మామూలుగా ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..