AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా

Sanath Jayasuriya : టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక సెమీస్ చేరకముందే నిష్క్రమించింది. పాకిస్థాన్‌పై 5 పరుగుల తేడాతో ఓటమి తర్వాత హెడ్ కోచ్ సనత్ జయసూర్య రాజీనామా చేయడం లంక క్రికెట్‌లో కలకలం రేపింది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతున్నా, కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Sanath Jayasuriya : సొంత గడ్డపై ఘోర పరాభవం.. హెడ్ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా
Sanath Jayasuriya
Rakesh
|

Updated on: Mar 01, 2026 | 9:32 AM

Share

Sanath Jayasuriya : టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక ప్రస్థానం విషాదాంతమైంది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతున్నా, కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోవడం ఆ దేశ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయం వెను వెంటనే లంక క్రికెట్‌లో పెను భూకంపం సంభవించింది. జట్టు హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జయసూర్య రాజీనామా ప్రకటన శ్రీలంక క్రికెట్ బోర్డుకు ముందస్తు సమాచారం లేకుండానే వెలువడింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తన కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు ఉన్నప్పటికీ, దానిని కొనసాగించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. జట్టు బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను అని ఆయన భావోద్వేగంగా చెప్పారు. వరల్డ్ కప్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి 13 నుంచి షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో మాత్రం ఆయన జట్టుతో కలిసి ఉండే అవకాశం ఉంది.

నిజానికి జయసూర్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో శ్రీలంక జట్టు అద్భుత విజయాలను అందుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆయన పగ్గాలు చేపట్టాక, ఆగస్టులో టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలవడం ఒక సంచలనం. అలాగే ఇంగ్లాండ్‌లో ఓవల్ టెస్టు గెలవడం, న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేయడం వంటి విజయాలతో లంక క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అందరూ భావించారు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్‌లో స్వదేశీ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో జట్టు విఫలమైంది. కీలక మ్యాచ్‌లలో తడబడటం సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది.

శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త కోచ్ వేటలో పడాల్సి ఉంది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమై ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు కోచ్ రాజీనామాతో లంక బోర్డుకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. జయసూర్య వంటి దిగ్గజం తప్పుకోవడం ఆ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us