Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు..
పశ్చిమ టర్కీలోని సిందిర్గి ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇస్తాంబుల్, ఇజ్మీర్ లాంటి పెద్ద నగరాల్లో కూడా ప్రకంపనలు కనిపించాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు అని అధికారులు తెలిపారు. గత మూడు నెలల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం. ప్రస్తుతం రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

టర్కీలోని పశ్చిమ ప్రాంతాన్ని భూకంపం వణికించింది. రాత్రి సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని టర్కీ విపత్తు-అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు మీడియా నివేదికలు తెలిపినప్పటికీ.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణం భూకంప కేంద్రంగా ఉంది. ఈ భూకంపం రాత్రి 10:48 గంటలకు 5.99 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీన్ని ప్రభావం టర్కీలోని ఆర్థిక-జనాభా పరంగా ముఖ్యమైన నగరాలైన ఇస్తాంబుల్, ఇజ్మీర్‌తో పాటు సమీపంలోని బుర్సా, మానిసా ప్రావిన్సులలో కూడా కనిపించింది.
రెండవ అతిపెద్ద భూకంపం
ఇది గత మూడు నెలల్లో ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన రెండవ అతిపెద్ద భూకంపం కావడం గమనార్హం. ఈ ఘటనలో ఇప్పటివరకు అయితే ప్రాణనష్టం జరగలేదని మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. గతంలో భూకంపాల వల్ల దెబ్బతిన్న మూడు భవనాలు, ఒక దుకాణాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించినట్లు చెప్పారు. ఇజ్మీర్‌కు ఈశాన్యంగా 138 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందిర్గి ప్రాంతం పర్వతాల మధ్య ఉండటం వల్ల తరచుగా భూకంపాలు భయపెడుతుంటాయి. భారీ నష్టం జరిగి ఉండవచ్చని మొదట్లో భావించారు.
టర్కీకి భూకంపాల బెడద
టర్కీ అనేక ఫాల్ట్ లైన్ల మీద ఉంది. అందుకే ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో గత మూడు నెలల్లో వచ్చిన రెండో పెద్ద భూకంపం ఇది. గతంలో ఆగస్టు 10న కూడా 6.1 తీవ్రతతో ఇక్కడ భూకంపం వచ్చి ఒకరు మరణించారు. అలాగే 2023 ఫిబ్రవరిలో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల 53,000 మందికి పైగా చనిపోయారు. కాగా ప్రస్తుతం స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు భయపడకుండా, పుకార్లను నమ్మకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
BREAKING: Buildings collapse in town of Sındırgı in Balıkesir, Turkey after strong earthquake. – local media pic.twitter.com/La3JawaKJk
— AZ Intel (@AZ_Intel_) October 27, 2025
