Telangana Cabinet: పట్నానికి పట్టంపై సస్పెన్స్.. రాజ్‌భవన్ నుంచి అందని సమాచారం.. మళ్లీ మొదలైందా..?
Telangana Cabinet Updates: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేదంటూ రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది.

Telangana Cabinet Updates: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటికీ.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేదంటూ రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. దీంతో పట్నానికి పట్టంపై.. సస్పెన్స్ నెలకొంది.. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాండూరు టికెట్‌ను పైలెట్ రోహిత్‌రెడ్డికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే నియోజకవర్గంలో.. సీనియర్ నేతగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డికి భవిష్యత్‌పై అభయం ఇచ్చారు. ప్రస్తుత కేబినెట్‌లోకి పట్నంను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం (ఆగస్టు 23) 11.30కి ప్రమాణస్వీకారం ఉంటుందనే వార్తలు వచ్చాయి. పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే, రాజ్‌భవన్‌లో అలాంటి వాతావరణం ఏమీ కనిపించలేదు. దీంతో రేపు లేదా ఎల్లుండి ఈ ప్రమాణం ఉండొచ్చని తెలుస్తోంది. గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం వస్తే.. దానికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. పట్నం మహేందర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు ఇప్పటికే సమాచారం అందింది. అయితే, గవర్నర్ అందుబాటులో లేని కారణంగానే ఈ కార్యక్రమానికి తేదీ, సమయం ఫిక్స్ కాలేదంటున్నారు.. ముందు అనుకున్నదాని ప్రకారం.. ఇవాళ ప్రమాణం జరగాల్సి ఉన్నా.. గవర్నర్ కార్యాలయంలో ఎలాంటి సందడి లేకపోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
పంటి నొప్పితో ఆసుపత్రికి గవర్నర్..!
అయితే, ఇవాళ గవర్నర్ తమిళిపై ప్రమాణ స్వీకారానికి టైమ్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసినట్లు పేర్కొంటున్నారు. తమిళిసై తీవ్ర పంటి నొప్పితో బాధ పడుతుండటంతో మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు సమాచారం. గవర్నర్ డెంటల్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వెళ్లడం, ఇతర కారణాలతో క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం లేదా శుక్రవారం ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయం తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది.
మళ్లీ గ్యాప్ వచ్చిందా..?
తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కార్యాలయం మధ్య కొంత కాలం నుంచి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. పలు బిల్లుల ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొదలైన వివాదం తారాస్థాయికి చేరి.. ఇటీవలనే సద్దుమణిగింది. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణం విషయంలో.. సీఎంఓ, గవర్నర్ భవన్ వివాదం మరోసారి చర్చలోకి వచ్చింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
