Telangana: విద్యార్థులకు అలెర్ట్.. రాష్ట్రంలో ఆ రోజు నుంచి కాలేజీలన్నీ బంద్..!
తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్‌కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసు ప్రభుత్వానికి అందించారు. సమస్య పరిష్కారం కోసం సమాఖ్య ప్రతినిధులు మంత్రులతో చర్చించినా, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో బంద్ పాటించేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అయ్యారు. భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేసుకొని ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని కాలేజీల బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించిన సమాఖ్య, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. తెలంగాణలో నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించాయి ప్రైవేటు కాలేజీలు. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం హామీ ఇచ్చి మళ్లీ నెరవేర్చక పోతే.. మార్చి , ఏప్రిల్‌లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. బకాయిలు అడిగితేనే ప్రభుత్వానికి విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని.. — బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు దీపావళి నాటికి 1200 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం… ఇవ్వలేదని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దసరాకి 600 కోట్లు ఇస్తామని చెప్పి 200 కోట్లు మాత్రమే ఇచ్చిందని… మిగిలిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిల విడుదలపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సమాఖ్య ప్రతినిధులు ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తీవ్రతరం చేస్తూ, నవంబర్ మొదటి వారంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బందితో ‘చలో హైదరాబాద్’ నిర్వహించాలని ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలు యోచిస్తున్నాయి.
రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని, వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఎక్కువ మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నారని.. సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని తెలంగాణ ఉన్నత విద్యా సంఘాల సమాఖ్య తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




