Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు RRR సెగ.. రైతల మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వానికి షాక్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్, కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పోటీ పడుతుంటే.. ఉప ఎన్నికను వేదికగా చేసుకోవాలని ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు భావిస్తున్నారు. డిమాండ్ల సాధనకు ట్రిపుల్ ఆర్ రైతులు మాస్ నామినేషన్స్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. అసలు ఆర్ఆర్ఆర్ రైతుల సమస్య ఏంటి..? అనేది తెలుసుకుందాం..

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహా నగరానికి మరో మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవపూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో 161 కిలోమీటర్ల మేర సాగనుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు (189 కిలోమీటర్లు) నిర్మాణం కానుంది. ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానుంది.
ట్రిపుల్ ఆర్ రైతుల ఆందోళన..
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంతో భూములను కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను మార్చడంతో పాటు నష్టపరిహారాన్ని కూడా పెంచాలని డిమాండ్‌తో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా..రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ను ప్రస్తుత ఓఆర్‌ఆర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు తాము తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల, ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్‌కు సంబంధించిన ఇటీవల హెచ్ఎండిఏ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై రైతుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ఆందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
మాస్ నామినేషన్స్ వ్యూహం..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రానికి RRR లైఫ్‌లైన్ కానుందని ప్రభుత్వం అంటుండగా, బాధిత రైతులు మాత్రం తమ డెత్‌లైన్‌గా భావిస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో.. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్‌ను మార్చడంతో పాటు నష్టపరిహారాన్ని కూడా పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై బాధిత రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డు పరిధిలోని అన్ని గ్రామాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భూనిర్వాసితులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి తమ నిరసనను తెలియజేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో బాధిత రైతులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారట. తమ వాణినీ బలంగా వినిపించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ఉప ఎన్నికల్లో భూనిర్వాసితులు నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను రాష్ట్ర,జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను వేదికగా చేసుకుని ట్రిపులార్ ఆలైన్‌మెంట్‌తో ఎండగట్టాలనే యోచనలో రైతులు ఉన్నారు. గతంలో ఫ్లోరైడ్ సమస్యను జాతీయ స్థాయి దృష్టికి తీసుకువెళ్లేందుకు 1996 పార్లమెంట్ ఎన్నికల్లో జలసాధన సమితి.. 480 మంది అభ్యర్థులను బరిలో దించింది. అసాధారణంగా అభ్యర్థులు బరిలో ఉండడంతో నెల రోజులపాటు ఎన్నిక వాయిదా పడింది. గతంలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అర్వింద్ కుమార్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ఇదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 200 మంది బాధిత రైతులు నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని రేవంత్ సర్కారు తమ ఆవేదన అర్థం కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. భూనిర్వాసితులు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతుండటం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఒక సవాలుగా మారే ఛాన్స్ ఉంది. రైతుల సమస్యపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. ఈ నామినేషన్ల ప్రక్రియను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




