Telangana: అక్కడి విద్యార్థులకు 10 రోజుల సెలవులు.. కారణం ఏంటంటే..?
సాధారణంగా పాఠశాలలకు ఒకటి.. రెండు రోజులు సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతులు వేస్తారు. పది రోజులపాటు సెలవులు అంటే మాత్రం వారి సంతోషానికి అవధులు ఉండవు. కానీ ఈ పాఠశాల విద్యార్థులకు పది రోజులపాటు అధికారులు సెలవులు ఇచ్చారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులు కొందరు వరసగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఆరా తీయగా.. స్టూడెంట్స్ అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది. ఒక్కసారిగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడటాన్ని గుర్తించిన జిల్లా వైద్యశాఖ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించింది. స్కూల్ పరిసరాలను పరిశీలించి, వ్యాధి వ్యాప్తి కారణాలను వైద్యాధికారులు విశ్లేషించారు. 24 మంది పాఠశాల విద్యార్థులు అనారోగ్యం బారిన పడడానికి పచ్చ కామెర్ల వ్యాధి కారణమని అధికారులు నిర్ధారించారు.
స్కూల్‌లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పటికీ, మరికొందరి విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది. పిల్లలకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట, హైదరాబాద్, నార్కెట్ పల్లి, ఖమ్మం ఆస్పత్రులకు తల్లిదండ్రులు తరలించారు. జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలు చేపట్టినప్పటికీ వ్యాధి విస్తరిస్తుండడంతో అధికారులు ఆందోళన ఎక్కువైంది. ఈ వ్యాధి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావించారు. ఇందుకోసం ముందస్తు జాగ్రత్త చర్యగా కామెర్ల వ్యాధి సోకిన విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు 10 రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు మండల విద్యాధికారి వెంకటరెడ్డి తెలిపారు. కాగా పిల్లల అస్వస్థతకు తాగునీటి కాలుష్యమే కారణమని తెలిసింది. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




