Telangana: తవ్వకాల్లో బయటపడ్డ భారీ బండరాయి.. ఆపై వింత లిపి.. ఏంటా అని పరిశీలించగా
గ్రామ సెంటర్‌లో బొడ్రాయి వద్ద తవ్వుతుండగా పెద్ద శబ్దాలు వినిపించాయి. గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏమైందో తెలియక ఆందోళన చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

అనాసాగరంలో మరో కొత్త శాసనం వెలుగు చూసింది. నేలకొండపల్లి చరిత్రకు మరో కలికితురాయిగా కాకతీయుల కాలం నాటి శాసనం దొరికింది. దేవాలయాలు ఏమయ్యాయో కానీ దానశాసనం మిగిలింది. కాకతీయ గణపతిదేవుని కాలం నాటి రేచర్ల రెడ్డిరాజుల దానశాసనం అని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అనాసాగరంలోని పాతబొడ్రాయి ఏరియా రావిచెట్టుసెంటర్లో కాకతీయ కాలపు శాసనం వెలుగుచూసింది. నాలుగడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నాలుగుముఖాల నల్లరాతి బండపై ఒకవైపున 19 పంక్తుల, తెలుగులిపి, తెలుగుభాషలో వేయబడిన కొత్త శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కో-కన్వీనర్ కట్టా శ్రీనివాస్ గుర్తించి చదివారు.
శాసనం మీద శివలింగం దానికి అటు.. ఇటు.. సూర్యచంద్రుల చిహ్నాలున్నాయి. ఇవి దానకర్తల దానఫలాన్ని, వారి యశస్సుని ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలబడాలని కోరికను వ్యక్తం చేస్తాయనీ వారు తెలిపారు. మధ్యలోని శివలింగం వారి శైవభక్తికి నిదర్శనం. శకయుగం 1143/4, వృషనామ సం. శ్రావణ శుద్ధ అష్టమి గురువారం నాడు అంటే క్రీ.శ.1221 జూలై 29వ తేదీన మహామండలీశుడు కాటెయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యమేలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవసెట్టి, కొమ్మోజు కట్టించిన రుద్రసముద్రం కింద రామనాథదే వరకు 1 మర్తురు అంటే దాదాపు ఎకరన్నర, ఆదికేశవదేవరకు 1 మర్తురు, కామేశ్వరుదేవరకు 1మర్తురు, లక్ష్మికి 1మర్తురు భూదానం చేసినట్లు ఈ శాసనం చెబుతోంది. ఈ శాసనంలో పేర్కొనబడ్డ కాటయ.. దిచ్చకుంట(1217)శాసనంలో పేర్కొనబడ్డవారే. గ్రామపెద్దలు, గ్రామస్తులు వందలాది ఏళ్ళ నుంచి తమ గ్రామం ఉనికిలో ఉన్నదని తెలపడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ శాసనాన్ని వదిలేయకుండా అదే బొడ్రాయి దగ్గరలో జాగ్రత్తగా ప్రతిష్టించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








