ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మరీ ఆదర్శ వివాహం చేసుకుందో జంట. పెళ్లిచేసుకున్న తర్వాత కొన్నాళ్లు వీరి సంసారం ఎంతో సాఫీగా సాగింది. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఏడాది తిరగకుండానే భార్యను అతి దారుణంగా పతి దేవుడు హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌లో గురువారం ఈ దారుణ ఘటన..

తాండూరు, డిసెంబర్ 19: ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మరీ ఆదర్శ వివాహం చేసుకుందో జంట. పెళ్లిచేసుకున్న తర్వాత కొన్నాళ్లు వీరి సంసారం ఎంతో సాఫీగా సాగింది. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఏడాది తిరగకుండానే భార్యను అతి దారుణంగా పతి దేవుడు హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌లో గురువారం ఈ దారుణ ఘటన జరిగింది. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్‌కోట గ్రామానికి చెందిన దస్తప్ప, చంద్రమ్మ దంపతుల కూతురు అనూష (20). భర్త అనారోగ్యంతో మరణించడంతో చంద్రమ్మ తన కుమార్తెతో కలిసి సాయిపూర్‌లో నివాసం ఉండేది. ఇదే గ్రామానికి చెందిన పరమేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒకే ఊరు, ఒకే వీధిలో ఉండటం వల్ల పరమేశ్, అనూష మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబాల ఒప్పించి ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన 3 నెలల నుంచే పరమేశ్‌కు అత్యాశ పుట్టుకొచ్చింది. అనూషను కట్నం, బంగారం తేవాలంటూ తరచూ హింసించేవాడు. అతడి తల్లిదండ్రులు కూడా కోడలిని కట్నం కోసం వేధించేవారు.
ఈ క్రమంలో తన కూతురును అల్లుడు హింసిస్టున్నాడని తెలుసుకున్న అనూష తల్లి చంద్రమ్మ అనూషను పుట్టింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పరమేష్ మార్గం మధ్యలో అడ్డగించి అనూషను తమ ఇంటికి తీసుకెళ్లి కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక అనూష కుప్పకూలింది. దీంతో తల్లి చంద్రమ్మ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అనేష మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చంద్రమ్మ పోలీసులకు అల్లుడు రమేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పరమేష్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








