మహా శివరాత్రి
హిందూ మతంలోని మహాశివరాత్రి పండగకు విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం, లింగోద్భవం జరిగిందని విశ్వాసం. కనుక మహా శివరాత్రి రోజున శివ శక్తులను అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి.. జాగరణ చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినం మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివ రాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు, శివాలయాల్లో సందడి మొదలైంది. దేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు, శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజున శంకరుడిని పూజించడం వల్ల భక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారని నమ్మకం. అంతేకాదు ఉపవాసం చేసిన భక్తులు సహా ప్రతి ఒక్కరూ శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రి అంతా మేల్కొంది జాగరణ చేస్తారు. ఈ రోజును శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.