Brain Facts: తాగినప్పుడు పాత లవర్ గుర్తొస్తుందా? మీ మెదడులో జరిగేది ఇదే..
చాలా మంది సరదాగా పార్టీలలో మద్యం సేవించినా, కాసేపటి తర్వాత అకస్మాత్తుగా భావోద్వేగానికి లోనవుతుంటారు. ముఖ్యంగా పాత జ్ఞాపకాలను, మాజీ ప్రేయసిని లేదా గతాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. ఉదయం నిద్రలేచి తన కాల్ లాగ్ చూసుకున్నప్పుడు గానీ చేసిన తప్పు తెలియదు. దీనినే సరదాగా 'డ్రంక్ కాల్స్' లేదా 'డ్రంక్ టెక్స్టింగ్' అని పిలుస్తారు. అసలు నూనె తగిలిన తర్వాత మనిషి ప్రవర్తనలో ఇంతటి మార్పు ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

మద్యం సేవించినప్పుడు మన మెదడులోని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. మన ప్రవర్తనను, భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం ఆల్కహాల్ ప్రభావంతో నెమ్మదిస్తుంది. దీనివల్ల లోపల దాచుకున్న బాధలు, భయాలు ఎటువంటి ఫిల్టర్ లేకుండా బయటకు వచ్చేస్తాయి. దీనినే శాస్త్రవేత్తలు ‘ఆల్కహాల్ మయోపియా’ అని కూడా పిలుస్తారు. అంటే ఆ సమయంలో మనిషికి కేవలం ప్రస్తుత భావోద్వేగం తప్ప, దాని వల్ల వచ్చే పరిణామాలు గుర్తుకురావు. ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న అసలు మెకానిజం ఏంటో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం.
మెదడులో బ్రేకులు ఫెయిల్ అయితే..
మన మెదడులోని ‘ప్రిఫ్రంటల్ కార్టెక్స్’ (Prefrontal Cortex) అనే భాగం మన వ్యక్తిత్వాన్ని, నిర్ణయాలను నియంత్రిస్తుంది. ఎవరితో మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, సమాజంలో ఎలా ఉండాలి అనే ‘బ్రేకులు’ వేసేది ఇదే భాగం. ఆల్కహాల్ రక్తంలో కలిసి మెదడుకు చేరినప్పుడు, ఈ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు నెమ్మదిస్తుంది. సరళంగా చెప్పాలంటే, మీ మెదడుకు ఉండే బ్రేకులు విఫలమవుతాయి. దీనివల్ల సాధారణ సమయంలో బయటపడని మీ అసలు ఆవేదన, ప్రేమ లేదా కోపం ఒక్కసారిగా బయటకు తన్నుకొస్తాయి.
డోపమైన్ చేసే మాయ..
మద్యం తాగినప్పుడు మెదడులో ‘డోపమైన్’ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మనిషికి అప్పటికప్పుడు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అందుకే అంతకుముందు మాట్లాడటానికి భయపడిన వ్యక్తులతో కూడా ధైర్యంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. అయితే, ఇదే సమయంలో ‘ఆల్కహాల్ మయోపియా’ కారణంగా మనిషి దృష్టి చాలా సంకుచితంగా మారుతుంది. రేపటి గురించి ఆలోచించే శక్తి పోయి, ఆ క్షణంలో ఉన్న బాధే ప్రపంచంలా కనిపిస్తుంది. అందుకే పాత ప్రేయసిని మిస్ అవుతున్న భావన కలిగితే, అది తీవ్రమై ఏడుపుగా మారుతుంది.
సామాజిక ఆందోళన మాయం
చాలా మంది బిడియం లేదా భయం వల్ల తమ మనసులోని మాటను చెప్పలేరు. మద్యం ఈ సామాజిక ఆందోళనను (Social Anxiety) తగ్గిస్తుంది. దీనివల్ల మనసులో లోతుగా పాతుకుపోయిన జ్ఞాపకాలు, ముఖ్యంగా విడిపోయిన ప్రేమికుల జ్ఞాపకాలు సులభంగా ఉపరితలానికి వస్తాయి. నియంత్రణ కోల్పోయిన మెదడు, ఆ జ్ఞాపకాలను ఆపుకోలేక కన్నీళ్ల రూపంలో బయటకు పంపుతుంది. అందుకే తాగిన వాళ్లు చేసే ఫోన్ కాల్స్ వెనుక వారి బలహీనమైన మెదడు నియంత్రణే ప్రధాన కారణం.
