వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే లేదా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రతి యేటా ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర పాశ్యాత్య దేశాల్లో జరుపుకునే వాలెంటైన్స్ డేకి గత కొన్ని దశాబ్ధాల కాలంగా భారత్‌లోనూ ప్రాచుర్యం పొందింది. రోమ్ దేశంలో జన్మించిన వాలెంటైన్ అనే ఓ ప్రవక్త.. ఈ ప్రేమికుల రోజుకు ఆద్యుడు. వాలెంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించేవాడు. అప్పట్లో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె కూడా వాలెంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో ప్రేమ సందేశాలతో యువతను తప్పు దోవ పట్టిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరితీయించారు.
వాలెంటైన్‌ను ఉరితీసిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గాలెసియన్స్ వాలెంటైన్‌ను ఉరితీసిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తమ ప్రేమను వ్యక్తంచేసేందుకు చాలా మంది వాలెంటైన్స్ డేను ఎంచుకుంటున్నారు. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులు తమకు ఇష్టమైన కానుకలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలాగే తమకు ఇష్టమైన ప్రదేశాలకు ట్రావెల్ చేస్తూ ఆ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తం వారం రోజుల పాటు వాలెంటైన్ వీక్ (ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు) గా జరుపుకుంటారు. కొన్ని విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం అమలు ఉండటం విశేషం.
అయితే ప్రేమికుల దినోత్సవం భారత సంస్కృతికి వ్యతిరేకమంటున్నాయి భజరంగ్‌దళ్, వీహెచ్‌పీలు. అదే రోజున దేశ స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి కోర్టు మరణశిక్ష విధించడంతో ఆ రోజును వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని సూచిస్తున్నాయి. ప్రేమికుల రోజున వ్యతిరేకించే వారిలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతావనిలో ఎక్కువని ఓ సర్వేలో తేలింది.