Hyderabad: స్కూల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించండి.. యాజమాన్యాలకు పోలీస్ కీలక ఆదేశాలు!
నగరంలోని విద్యార్థులు ప్రైవేటు వాహనాలు కాకుండా స్కూల్ వాహనాలను వినియోగించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం స్కూల్ యాజమాన్యాలతో సమన్వయ సమావేశం జరిగింది. మాదాపూర్ జోన్ పరిధిలోని పలు ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి జాయింట్ సీపీ ట్రాఫిక్ డా. గజారావు భూపాల్, ఐపీఎస్, ఇతర ట్రాఫిక్ అధికారులు హాజరయ్యారు. స్కూల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు సంబంధించిన ట్రాఫిక్ నిర్వహణ, రద్దీ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా స్కూల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ట్రాఫిక్ అధికారులు హైలైట్ చేశారు. విద్యార్థులు ఎక్కువ మంది స్కూల్ బస్సులను ఉపయోగించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తే, స్కూల్ పరిసర ప్రాంతాల్లో వాహన రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో స్కూల్ పక్కన, యూ-టర్న్ వద్ద ప్రధానంగా సమస్యలు ఎదురవుతున్నాయని, అందువల్ల స్కూల్ వాహనాల కదలికకు సమర్థవంతమైన ప్రణాళిక అవసరమని సూచించారు. ఒకే మార్గంలో ఒకేసారి ఎక్కువ స్కూల్ వాహనాలు వెళ్ళకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు స్కూల్ సమయాలను వ్యత్యాసం పాటించేలా చూడాలని కూడా యాజమాన్యాలను కోరారు.
ఇక తల్లిదండ్రులకు కార్ పోలింగ్ పద్ధతి గురించి అవగాహన కల్పించడం ద్వారా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గించే అవకాశం ఉందని ఈ సమావేశంలో చర్చించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం బస్సు డ్రైవర్లకు నిరంతరంగా ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు స్పష్టమైన మార్గదర్శకాలు, ప్రయాణ మార్గాలను స్కూల్ యాజమాన్యాలు అందించాలని సూచించారు. ఈ విధంగా స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే సురక్షితమైన, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, SCSC సీఈఓ నావేద్ ఖాన్ తో పాటు శాంతా మరియా ఇంటర్నేషనల్ స్కూల్, ఫినిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ నార్సింగి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నానక్‌రామ్ గూడ, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ మజీద్‌బండ, మెరీడియన్ స్కూల్ మాదాపూర్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నానక్‌రామ్ గూడ, నాస్ర్ స్కూల్ గచ్చిబౌలి, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ తదితర పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




