Telangana Floods: ఊళ్లు ఏర్లయ్యాయ్..! ఇళ్లు-వాకిళ్లు కొట్టుకుపోయాయ్.. చరిత్రలో చూడని వరద..
400 ఎకరాల్లో వరి వేస్తే కనీసం 4 గుంటల పంట కూడా మిగల్లేదు. ఇది జస్ట్ కామారెడ్డి జిల్లా లింగాయపల్లిలో జరిగిన నష్టం మాత్రమే. రైతులు, రైతు సంఘాలు చెబుతున్నదైతే.. 10 లక్షల ఎకరాల్లోని పంట నీట మునిగింది. కేవలం ప్రాథమిక అంచనానే ఇది. అందులోనూ ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన నష్టాన్నే ప్రాథమికంగా అంచనా కట్టారు. ఈ లెక్కన తెలంగాణవ్యాప్తంగా ఇంకెంత నష్టం జరిగి ఉంటుంది?

అన్నదాత కష్టం అప్పుతోనే మొదలవుతుంది. పోయిన పంటలో ఎంత మంచి దిగుబడి వచ్చినా.. అప్పులు, వడ్డీలు, అవసరాలకే సరిపోతాయ్. మళ్లీ పంట వేయాలంటే మళ్లీ అప్పు చేయాల్సిందే. ఈసారీ అలాగే సాగు మొదలుపెట్టారు. వర్షాలొస్తాయ్ పోతాయ్ అనుకున్నారు గానీ.. ఇలా ఏకంగా ఊడ్చిపెట్టేసేంత వర్షం పడుతుందని ఊహించలేదు రైతు. ఓ అంచనా ప్రకారం 10 లక్షల ఎకరాలు నీట మునిగితే.. అందులో లక్షన్నర ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే.. ఒక మొక్క కూడా మిగల్లేదు ఆ లక్షన్నర ఎకరాల్లో.. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది.. నీటమునిగిన ఈ పంటలు చేతికందే పరిస్థితే కనిపించడం లేదు. పత్తికాయలు వరద పాలయ్యాయి. ఎర్రనీటి వరదతో నిండిపోయిన పొలాలను చూసి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇక కౌలు రైతుల పరిస్థితైతే అత్యంత దారుణం. కొన్ని చోట్ల ఇంకా వరి నాట్ల దశలోనే ఉన్నాయి. అక్కడ కూడా అపార నష్టం జరిగింది. కామారెడ్డి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో పంటలు నామారూపాల్లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా పంటపొలాల్లో వరద, ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. కామారెడ్డి, నిర్మల్, మెదక్‌తో పాటు సిద్దిపేట, సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. దాన్ని కూడా లెక్కిస్తే ఇంకెంత నష్టం తేలుతుందో. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోమ్ చందా గ్రామం గోదావరి పరిసర ప్రాంతంలో ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ వరద నీరు సుమారు 100 ఎకరాల పసుపు, మొక్కజొన్న, సోయా...




