మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం ఏంటంటే..?
ఇతరుల కంటే మీకు ఎక్కువగా చలి అనిపిస్తే కొన్ని ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. జీవక్రియ మందగించడం, రక్త ప్రసరణ లోపాలు, విటమిన్ బి12 లేదా డి లోపం, థైరాయిడ్ సమస్యలు దీనికి కారణం కావచ్చు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఐరన్, బి12 అధికంగా ఉండే ఆహారాలు, అల్లం, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం మంచిది.

చలికాలంలో చలి వేయడం సహజం. కానీ ఇతరులతో పోలిస్తే మీకు ఎక్కువగా చలి అనిపించడం, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సాక్స్, వెచ్చని బట్టలు లేకుండా ఉండలేకపోవడం వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు దాగి ఉన్నాయి. మీ శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో లోపాలు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియనే జీవక్రియ అంటారు. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. ఎవరికైతే జీవక్రియ నెమ్మదిగా ఉంటుం, వారి శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల చేతులు, కాళ్లు చల్లగా మారుతుంటాయి.
రక్త ప్రసరణ సమస్యలు
శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు, రక్తం చేతులు, కాళ్ల చివరి భాగాలకు తగినంతగా చేరదు. దీనివల్ల ఆ భాగాలు చల్లబడిపోతాయి. శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
విటమిన్ బి12 లోపం
శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి విటమిన్ బి12 చాలా అవసరం. ఇవి శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. బి12 లోపం వల్ల రక్తహీనత ఏర్పడి, శరీర కణాలకు అందాల్సిన ఆక్సిజన్ అందక శరీరం చల్లగా మారుతుంది.
విటమిన్ డి – థైరాయిడ్
విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా దెబ్బతింటుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే శరీరం తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది, ఫలితంగా చలికి సున్నితత్వం పెరుగుతుంది.
చలిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం
మిమ్మల్ని మీరు లోపల నుండి వెచ్చగా ఉంచుకోవడానికి మీ డైట్‌లో ఈ మార్పులు చేసుకోండి:
ఐరన్ – బి12: పాలకూర, బీట్‌రూట్, గుడ్లు, చేపలు, చికెన్ మరియు పాలు అధికంగా తీసుకోండి.
అల్లం, వెల్లుల్లి: మీరు తాగే సూప్ లేదా టీలో అల్లం, వెల్లుల్లి చేర్చడం వల్ల జీవక్రియ వేగవంతమై శరీరం వెచ్చగా ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ (అక్రూట్), ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినండి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
సుగంధ ద్రవ్యాలు: పసుపు, జీలకర్ర, మిరియాలు వంటివి వంటల్లో ఎక్కువగా వాడండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చలి నుండి రక్షిస్తాయి.
చిన్న సూచన: ఒకవేళ మీకు అతిగా చలి వేస్తుంటే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




