AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పిట్ట కొంచెం కూత ఘనం.. అద్భుతమైన జ్ఞాపకశక్తిలో అబ్బుర పరుస్తున్న చిన్నారి..!

పుట్టగానే పూవు పరిమళిస్తుంది అనడానికి ఈ చిన్నారి ఉదాహరణ ఉపాసన. చిన్ననాటి నుంచే మహనీయుల పేర్లు వారి చిత్ర పటాలను గుర్తించుకోవడం, దేశ రాజధానులు, ప్రపంచ రాజధానుల వంటి అనేక అంశాలను గుర్తు పెట్టుకంది. చిన్నారికి ఉన్న గ్రహణ శక్తిని గమనించిన తల్లి అనూష.. ఇండియా, వరల్డ్ మ్యాప్స్, ఇతర అంశాలకు సంబంధించి 100 పజిల్స్‌ను వేగంగా కలిపి చిత్రపటాలను తయారు చేయడం నేర్పించింది.

Telangana: పిట్ట కొంచెం కూత ఘనం.. అద్భుతమైన జ్ఞాపకశక్తిలో అబ్బుర పరుస్తున్న చిన్నారి..!
Upasana
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 05, 2025 | 11:50 AM

Share

సాధారణంగా బుడి బుడి అడుగులు వేస్తూ.. వచ్చి రాని మాటలతో అల్లరి చేష్టలతో ముద్దొస్తుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ పాటవాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహనీయుల పేర్లు వారి చిత్రపటాలను గుర్తించుకోవడం, రాష్ట్రాల రాజధానులు, ప్రపంచ దేశాల రాజధానుల వంటి అంశాల్లో అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి ప్రశంసలు పొందింది. మరి ఆ చిచ్చరపిడుగు గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన శ్రీరంగం శివప్రసాద్, అనూష దంపతులు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఉపాసన అనే రెండున్నరేళ్ళ పాప ఉంది. చిన్నారి ఏడాదిన్నర వయస్సులో ఇండియాకు వచ్చి ఇక్కడే నేరేడుచర్లలో ఉంటోంది. అయితే చిన్నారి మొబైల్ ఫోన్ కు బానిస కాకుండా ఉండేందుకు తల్లి అనూష.. ఖాళీ సమయాల్లో పక్షులు, జంతువులు, దేవుళ్ళు, కూరగాయలు, పండ్లు, రంగు రంగుల వివిధ దేశాల జెండాలు కార్డులు చూపించి గుర్తుపట్టేలా నేర్పించారు.

ఈ క్రమంలోనే మహనీయుల పేర్లు వారి చిత్ర పటాలను గుర్తించుకోవడం, దేశ రాజధానులు, ప్రపంచ రాజధానుల వంటి అనేక అంశాలను నేర్పించారు. ఉపాసనకు ఉన్న గ్రహణ శక్తిని గమనించిన తల్లి అనూష.. ఇండియా, వరల్డ్ మ్యాప్స్, ఇతర అంశాలకు సంబంధించి 100 పజిల్స్‌ను వేగంగా కలిపి చిత్రపటాలను తయారు చేయడం నేర్పించింది. ఉపాసన వేగంగా పజిల్స్ తో చిత్రపటాలను వేస్తూ ఏకసంతాగ్రహీ గా మారింది. ఇండియా ప్రపంచ దేశాలకు సంబంధించి కలరింగ్ వేయడం కూడా నేర్చు కుంటోంది. అతి చిన్న వయసులో మహనీయుల పేర్లు, చిత్రపటాలతో పాటు భౌగోళికఅంశాల పైన ఆమెకున్న జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది చిన్నారి.

అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రతిభాపాటవాలతో నోట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల చేత గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రంతో కూడిన కేసీఆర్ చిత్రపటానికి చెందిన పజిల్ వేగంగా కలిపి కేసీఆర్ చిత్రపటాన్ని తయారు చేసింది. బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడే బేబీ ఉపాసన ప్రజ్ఞాపాటవాలను చూసి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బేబీ ఉపాసన సాధించిన రికార్డుల పత్రాలపైన ఆమె తల్లిదండ్రులు కేటీఆర్ సంతకాన్ని ఒక జ్ఞాపకంగా తీసుకున్నారు. బేబీ ఉపాసన సాధిస్తున్న రికార్డుల పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రజ్ఞా పాటవాలతో బేబీ ఉపాసన భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించాలని బంధువులు, స్థానికులు కోరుకుంటున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..