Gold Prices: బంగారం ధరలను తగ్గించేందుకు కొత్త విధానం..? కేంద్రం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వం బంగారం ధరలపై కీలక ప్రకటన చేసింది. బంగారం ధరలను నియంత్రించే ఉద్దేశం లేదని తెలిపింది. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్న క్రమంలో.. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటన విడుదల చేసింది.

బంగారం ధరలు భగ్గుముంటున్నాయి. రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు షాక్ కలిగిస్తున్నాయి. తులం బంగారం ఏకంగా లక్షా 30 వేలకు చేరుకోగా.. కేజీ వెండి రెండు లక్షలు పలుకుతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర మరింతగా పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఇంకా కొన్ని రోజులు ఉండటంతో గోల్డ్ రేటు మరింతగా పరుగులు పెట్టే అవకాశమే కనిపిస్తుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి కొనసాగుతున్న క్రమంలో ఇప్పట్లో బంగారం ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాదిలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం క్లారిటీ
ఈ క్రమంలో బంగారం ధరలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ధరలు తగ్గేలా నియంత్రణ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కేంద్రం జోక్యం చేసుకుని ధరలు తగ్గేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. బంగారం ధరలను నియంత్రించే ప్రణాళిక తమ దగ్గర ఏమీ లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలను బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే ఉద్దేశం తమకు లేదని స్పష్టతనిచ్చారు.
హాల్‌మార్కింగ్ తప్పనిసరి
బంగారం నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందులో భాగంగానే బంగారంకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన బంగారం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. వినియోగదారులు మోసపోకుండా తాము నిబంధనలు అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక విధానం అమలు చేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదన్నారు.




