Sreeleela: శ్రీలీల చెప్పిన ఆ మాటకు పోలీసులతో పాటు అందరూ క్లాప్స్..
విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె, యువతను ఉద్దేశించి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బలమైన సందేశం ఇచ్చారు. నో డ్రగ్స్ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపునిచ్చిన శ్రీలీల వ్యాఖ్యలకు మంచి స్పందన లభించింది.

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల కేరింతల మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా శ్రీలీల యువతను ఉద్దేశించి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా బలమైన మెసేజ్ ఇచ్చారు. డ్రగ్స్ అనేది జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనం. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, క్రీడలు, కళలు వంటి అంశాల వైపు యువత దృష్టి పెట్టాలని సూచించారు. యువతే దేశానికి బలమైన పునాది. వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. కాబట్టి నో డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు చెప్పాలని, మీతో పాటు మీ స్నేహితులకు కూడా చెప్పాలని అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆలోచింపజేశాయి. శ్రీలీల మాటలకు యువతతో పాటు పెద్దల నుంచి కూడా మంచి స్పందన లభించింది.
డ్రగ్స్ పై శ్రీలీల చేసిన ప్రచారానికి పోలీసులు ప్రశంసించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, యువతలో సామాజిక చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పోలీసులు కోరారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం శ్రీలీల అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, వారితో కాసేపు ముచ్చటించారు. ఆమె సాదాసీదా స్వభావం, సామాజిక బాధ్యతతో మాట్లాడిన తీరు అందరి మనసులను గెలుచుకుంది. రాజాంలో జరిగిన ఈ కార్యక్రమం వినోదంతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన ఘట్టంగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




