Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు పాము కంటే ప్రమాదకరం.. వీలైనంత దూరంగా ఉండమంటున్న చాణక్య
చాణక్య నీతి మంచి, చెడు వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. కొంతమంది విషపూరితమైన పాముల కంటే చెడ్డవారని ఆచార్య చాణక్య చెప్పారు. అటువంటి వ్యక్తులకు వీలైనంత దూరం పాటించడం మంచిది. అటువంటి వ్యక్తుల సమక్షంలో ఉన్నా నాశనం అయిపోతారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మోసం చేసే ధోరణిని కలిగి ఉంటారు. వెన్నుపోటు పొడుస్తారు. చాణక్య నీతిలో ఎటువంటి వ్యక్తులు పాముల కంటే చెడ్డవారిగా వర్ణించారో తెలుసుకుందాం.

చాణక్య నీతి జీవితం గురించి ఆచరణాత్మక విషయాలను తెలియజేస్తుంది. ఆచార్య చాణక్య మతం, సంస్కృతి, న్యాయం, విద్య , మానవ జీవిత విధానం గురించి అనేక విషయాలను చెప్పాడు. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా జీవితాన్ని సులభతరంగా జీవించవచ్చు. చాణక్య నీతిలో జీవిత ఆచారాలను, నీతిని ఆచరణాత్మకంగా వివరించాడు. చాణక్య నీతి రాజు.. పౌరులు ఇద్దరికీ మంచి , చెడు వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది. మంచిగా ప్రవర్తించే వ్యక్తికి విద్య, జ్ఞానం వంటి లక్షణాలు ఉంటాయని.. అతను ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తాడని ఆచార్య చాణక్య చెప్పాడు. అయితే దుష్టుడికి ద్వేషం, అసూయ, మూర్ఖత్వం ఉంటాయి. చాణక్య నీతి దుష్ట వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. అలాంటి వ్యక్తులు విషపూరితమైన పాముల కంటే చెడ్డవారని పేర్కొంది.
దుష్టుడు అడుగడుగునా మోసం చేస్తాడు
చాణక్య నీతి దుష్టుడి చెడు దృష్టి నుంచి దూరంగా ఉండాలని చెబుతుంది. దుష్టుడిని.. పాముని పోల్చి చూస్తే.. పాము ఒకసారే కరుస్తుంది.. కనుక పాము మంచిదని ఆచార్య చాణక్య నమ్మాడు.. అయితే దుష్టుడు ప్రతి అడుగులోనూ కాటు వేస్తూనే ఉంటాడు. కనుక దుష్టుడి నుంచి దూరంగా ఉండడం మంచిది. దుష్టుడి కంటే పాము వెయ్యి రెట్లు మంచిదని చాణక్య నీతి చెబుతుంది. పాము తనని తొక్కినప్పుడు లేదా తనకు హాని కలిగించినప్పుడు మాత్రమే కరుస్తుంది.. కానీ దుష్టుడి ధోరణి పాము కంటే దారుణంగా ఉంటుంది. అతను ఎటువంటి కారణం లేకుండా మిమ్మల్ని బాధపెట్టడానికి ప్రయత్నించవచ్చు, ఎందుకంటే అతను ఎదుటివారిని బాధపెట్టి ఆనందాన్ని పొందుతాడు.
దుష్టడు రాజు అయినా, శిష్యుడైనా సరే వదులుకోవాలి
దుష్ట రాజుతో ప్రజలు ఎలా సంతోషంగా ఉండలేరో.. అదేవిధంగా దుష్ట స్నేహితుడితో ఆనందంగా ఉండలేరు. దుష్ట భార్య ఇంటి శాంతి, ఆనందాన్ని నాశనం చేస్తుంది. దుష్ట శిష్యుడు తన గురువుకి గౌరవాన్ని తీసుకురాడు. కనుక సంతోషంగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తుల వద్దకు వెళ్లకూడదు. సంతోషంగా ఉండటానికి మంచి రాజు రాజ్యంలో జీవించాలని ఆయన అంటున్నారు. సంక్షోభ సమయాల్లో సహవాసం కోసం మంచి వ్యక్తితో స్నేహం చేయాలి. లైంగిక ఆనందం కోసం, ఒక గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి.. కీర్తి , గౌరవం పొందాలంటే.. విలువలు ఉన్న వ్యక్తిని మాత్రమే తన శిష్యుడిగా చేసుకోవాలి.
మూర్ఖులకు, వేశ్యలకు దూరంగా ఉండటం మంచిది.
ద్వేష భావాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని చాణక్య నీతి చెబుతోంది. మూర్ఖులు పండితులను ద్వేషిస్తారని, పేదలు ధనవంతులను ద్వేషిస్తారని, వేశ్యలు ఉన్నత కుటుంబాల భార్యలను ద్వేషిస్తారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ఒక మూర్ఖుడు పండితులను చూసి అసూయపడతాడని ఆయన చెప్పాడు. అదేవిధంగా పేద వ్యక్తి ధనవంతుడి సంపదను చూసి అసూయపడతాడు. మరోవైపు, వేశ్యలు కోడళ్ళు… మంచి కుటుంబాల కుమార్తెలను చూసి అసూయపడతారు ఎందుకంటే వారికి మంచి కుటుంబాల భార్యల ప్రేమ.. ఆప్యాయత లభించదు.
శాంతిని ప్రేమించే వారిని అవమానించే వారికి దూరంగా ఉండండి
వేదాలను, గ్రంథాలను, పాండిత్యాన్ని, నైతికతను, శాంతిని ప్రేమించే ప్రజలను అవమానించే వారికీ దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పాడు. ఎందుకంటే వారి గురించి చెడుగా మాట్లాడేవాడు మూర్ఖుడు. మూర్ఖుడి మాటల వలన వారి ప్రాముఖ్యత తగ్గదు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసినా తప్పే కనుక ఇతరుల సద్గుణాలను చూసి అసూయ పడే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








