AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జాబ్ చేస్తూనే బీటెక్.. క్లాస్‌రూమ్ నుంచి కంపెనీ వరకు.. ఎలాగంటారా.?

వర్కింగ్ ప్రోఫెషనల్స్ ఇక సూపర్ గుడ్ న్యూస్.. జాబ్ చేస్తూనే బీటెక్ చేయవచ్చు. అలాగే క్లాస్ రూమ్ నుంచే కంపెనీ వరకు వెళ్ళొచ్చు. మరి అది ఎలాగో తెలుసా.? లేటెస్ట్ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

Telangana: జాబ్ చేస్తూనే బీటెక్.. క్లాస్‌రూమ్ నుంచి కంపెనీ వరకు.. ఎలాగంటారా.?
Students
Prabhakar M
| Edited By: |

Updated on: Dec 17, 2025 | 9:02 AM

Share

దేశవ్యాప్తంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వంటి టెక్నికల్ కోర్సులు పూర్తి చేసే వెసులుబాటును ఏఐసీటీఈ మరింత విస్తరించింది. కాలేజీల్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అమలు చేసుకునేందుకు అనుమతిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆఫీస్ వేళల తర్వాత లేదా వీకెండ్స్‌లో క్లాసులు వింటూ డిగ్రీలు పొందే అవకాశం అధికారికంగా మరింత బలపడింది. ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో పరిమితంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఇకపై దేశవ్యాప్తంగా ప్రోత్సహించనున్నట్లు ఏఐసీటీఈ స్పష్టం చేసింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్కిల్ అప్‌గ్రడేషన్, కెరీర్ గ్రోత్ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనికి అనుగుణంగా అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో కూడా పలు సవరణలు చేసింది.

యూనివర్సిటీలకూ ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి

ఇన్నాళ్లూ కొన్ని సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఏఐసీటీఈ అనుమతి లేకుండానే టెక్నికల్ కోర్సులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. తాజా సవరణల్లో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ఇకపై ఏ యూనివర్సిటీ అయినా టెక్నికల్ కోర్సులు నడపాలంటే ఏఐసీటీఈ ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏఐసీటీఈ స్కీమ్స్, బెనిఫిట్స్ పొందాలన్నా అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.

ఇండస్ట్రీలోనే చదువు.. ‘ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్’కు గ్రీన్ సిగ్నల్

ఇంజినీరింగ్ విద్యను కేవలం క్లాస్‌రూమ్స్‌కే పరిమితం చేయకుండా నేరుగా పరిశ్రమలతో అనుసంధానం చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ‘ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్’ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టనుంది. ఈ విధానంలో స్టూడెంట్స్ తమ కోర్సులో 50 శాతం వరకు చదువును కంపెనీల్లో పని చేస్తూనే పూర్తి చేయవచ్చు. ఇది కేవలం ఇంటర్న్‌షిప్ మాత్రమే కాదు. క్రెడిట్స్, పరీక్షలు, సర్టిఫికేషన్ అన్నీ కాలేజీ–ఇండస్ట్రీ కలిసి నిర్వహిస్తాయి. డిప్లొమా విద్యార్థులు ఏడాదిన్నర, బీటెక్/డిగ్రీ విద్యార్థులు ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఇండస్ట్రీలోనే గడపాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేదా పరిశ్రమలతో బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాలేజీలకే అనుమతి ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలకు కనీసం రూ.100 కోట్ల టర్నోవర్, ప్రత్యేక ల్యాబ్స్, ట్రైనింగ్ సెంటర్లు, మెంటార్స్ ఉండాల్సిందే.

సీట్లపై పరిమితి తొలగింపు.. టాప్ కాలేజీలకు మూడేళ్ల అఫిలియేషన్

2026–27 నుంచి ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్యపై ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేయనున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. సరిపడా ఫ్యాకల్టీ, ల్యాబ్స్, క్లాస్‌రూమ్స్ వంటి మౌలిక వసతులు ఉంటే మేనేజ్‌మెంట్ కోరినన్ని సీట్లకు అనుమతి ఇస్తారు. మరోవైపు ఎన్బీఏ గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, న్యాక్ స్కోర్ 3.01కు పైగా ఉండి వరుసగా ఐదేళ్లు 80 శాతం కంటే ఎక్కువ అడ్మిషన్లు సాధించిన టాప్ కాలేజీలకు ఇకపై ఏటా రెన్యువల్ అవసరం లేదు. వీటికి ఒకేసారి మూడేళ్ల అఫిలియేషన్ ఇస్తారు.

ఇతర కీలక మార్పులు ఇవే

విదేశీ విద్యార్థుల కోసం ఇంజినీరింగ్ కోర్సుల్లో 15 శాతం, పీజీ కోర్సుల్లో 25 శాతం అదనపు సీట్లు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్, మహిళల కాలేజీలకు సెక్యూరిటీ డిపాజిట్‌లో 50 శాతం రాయితీ ఇచ్చారు. కాలేజీల తనిఖీలకు వెళ్లే విజిట్ కమిటీలు ఇకపై ఫిజికల్‌తో పాటు ఆన్లైన్, హైబ్రిడ్ మోడ్‌లోనూ పరిశీలనలు చేయవచ్చు. ‘ఉల్లాస్’ స్కీమ్ కింద ప్రతి కాలేజీ ఏడాదికి కనీసం ఐదుగురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బాధ్యత తీసుకోవాలని సూచించింది. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద క్యాంపస్‌ల్లో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒకే ట్రస్ట్ లేదా సొసైటీ కింద ఒకే నగరంలో ఉన్న కాలేజీలను విలీనం చేసుకునే వెసులుబాటును కూడా ఏఐసీటీఈ ఇచ్చింది. మొత్తంగా చూస్తే, ఉద్యోగాలతో పాటు చదువును కొనసాగించే యువతకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు సాధించే విద్యార్థులకు ఈ కొత్త విధానం గేమ్‌చేంజర్‌గా మారనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..