Lunar Eclipse 2026: చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే స్పష్టంగా కనిపిస్తుందంటే..?
ఇవాళ నింగిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వెన్నెల కురిపించే చందమామ.. కాసేపు ఎర్రగా మారనున్నాడు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని ఎలా చూడాలి? బ్లడ్ మూన్ ప్రత్యేకం ఏంటి? టెలిస్కోప్ లేకపోయినా ఈ అద్భుతాన్ని చూడొచ్చా.. కెమెరాల్లో ఎలా బంధించాలి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకాశంలో కొన్ని గంటల్లో ఒక అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కాబోతోంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి రావడంతో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోయే బ్లడ్ మూన్‌గా కనిపించనుండటం విశేషం. భూమిపై రాత్రి సమయం ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. మన దేశంలో ఇవాళ మధ్యాహ్నం 3.21 నుంచి సాయంత్రం 6.47 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఆకాశం మేఘావృతం కాకుండా స్పష్టంగా ఉంటే ఎటువంటి పరికరాలు లేకుండానే కళ్లతో ఈ అద్భుతాన్ని చూడవచ్చు.
భారత్‌లో ఎప్పుడు చూడొచ్చు..?
మన దేశంలో చంద్రడు సాయంత్రం 6.20 నుంచి కనిపిస్తాడు. కాబట్టి 6.20 నుంచి 6.47 వరకు చూడొచ్చు. ఈ టైమ్‌లో పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. ఈ 27 నిమిషాలు చూడాలనుకునే వారికి చాలా కీలకం. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అంటారు. భూమి వాతావరణం సూర్యకాంతిలోని ఎరుపు రంగు తరంగదైర్ఘ్యాలను ఫిల్టర్ చేసి చంద్రునిపైకి పంపడం వల్లే ఈ రంగు వస్తుంది.
వీక్షించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చంద్రగ్రహణాన్ని చూడటానికి సూర్యగ్రహణంలా ప్రత్యేక ఫిల్టర్లు లేదా కళ్లద్దాలు అవసరం లేదు. నేరుగా కళ్లతో చూడటం సురక్షితమే. అయితే ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
సరైన ప్రదేశం: సిటీ లైట్లు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు లేదా పొలాల్లో ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
పరికరాలు: చంద్రుని ఉపరితలంపై మార్పులను గమనించడానికి బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ఉపయోగిస్తే మరింత అద్భుతంగా ఉంటుంది.
ఫోటోగ్రఫీ: మొబైల్ కెమెరా లేదా DSLR తో ఫోటోలు తీసేవారు ట్రైపాడ్ వాడటం వల్ల ఫోటోలు స్థిరంగా వస్తాయి. బ్యాటరీలు ఛార్జ్ చేసుకుని ఉంచుకోవడం మర్చిపోవద్దు.
