- Telugu News Photo Gallery Lionel Messi Visits Vantara: Tours Wildlife, Experiences Indian Culture and Names Lion Cub
Lionel Messi: వంతారా జూని సందర్శించిన లియోనెల్ మెస్సీ.. వన్య ప్రాణులతో వండర్‌ఫుల్ మూమెంట్స్
Lionel Messi Vantara visit : గోట్ ఇండియా టూర్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పర్యటన తర్వాత అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం వంతారాను సందర్శించారు. అక్కడ ప్రకృతి అందాలు, రకరకాల వన్య ప్రాణులను తిలకించాడు. అలాగే సాంప్రదాయ హిందూ ఆచారాలలో పాల్గొన్నాడు
Updated on: Dec 17, 2025 | 8:28 AM

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం వంతారాను సందర్శించారు. ఇక్కడి ప్రకృతి, వన్య ప్రాణుల సంరక్షణ, సాంప్రదాయ పద్దతులు మెస్సీకి మరపురాని అనుభవాన్ని ఇచ్చాయి.

కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ పర్యటన తర్వాత వంతారా సందర్శనకు వెళ్లిన మెస్సీతో పాటు ఇంటర్ మయామి జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా పాల్గొన్నారు. ఇక వంతారాలోకి అడుగు పెట్టగానే మెస్సీకి సాంప్రదాయ ఫోక్ మ్యూజిక్, పూల వర్షం, హారతితో స్వాగతించారు అధికారులు, ఇది భారతీయ సంస్కృతి, వైభవాన్ని చాటిచెప్పింది.

ఇక అర్జెంటీనా దిగ్గజం ఆలయంలో అంబే మాతా పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివ అభిషేకం వంటి మహా హారతిలో కూడా పాల్గొన్నారు, అనంతరం భారతదేశ, కాలాతీత ప్రకృతితో సామరస్యం తత్వశాస్త్రానికి అనుగుణంగా ప్రపంచ శాంతి, ఐక్యత కోసం ఆయన ప్రార్థనలు చేశారు.

ఇక తర్వాత వంతారాలోని విస్తృతమైన వన్యప్రాణి పర్యావరణ వ్యవస్థను గైడ్‌ల సహాయంతో మెస్సీ సందర్శించారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రక్షించ బడుతున్న పెద్ద పులులు, ఏనుగులు వంటి అనేక రకాల జంతువులను చూశారు. అలాగే గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను కూడా ఆయన సందర్శించాడు..

ఇక బిగ్ క్యాట్ కేర్ సెంటర్‌లోకి మెస్సీ అడుగుపెట్టిన వెంటనే సుసంపన్నమైన, సహజమైన వాతావరణంలో వృద్ధి చెందుతున్న సింహాలు, చిరుతలు, పులులు అతని వైపు ఆసక్తిగా కదలి వచ్చాయి. ఈ క్షణాలు మెస్సీకి మదురమైన అనుభూతిని, అనుభవాన్ని మిగిల్చాయి.

ఇక హెర్బివోర్ కేర్ సెంటర్, రెప్టైల్ కేర్ సెంటర్‌లో అతని పర్యటన కొనసాగింది, అక్కడ అతను ప్రత్యేకమైన పశువైద్య సంరక్షణ, అనుకూలీకరించిన పోషకాహారం, అధునాతన పెంపకం ప్రోటోకాల్‌ల కింద జంతువులు వృద్ధి చెందుతున్న విధానాన్ని గమనించాడు, ఇవి వంతారాను వన్యప్రాణుల సంక్షేమంలో ప్రపంచ ప్రసిద్ధిగా నిలిపాయి.

ఇక ఫాస్టర్ కేర్ సెంటర్‌లో అనాథ, బలహీనమైన యువ జంతువుల ప్రయాణాల గురించి మెస్సీ తెలుసుకున్నారు. ఈ ఆనంద సమయంలో అనంత్ అంబానీ, రాధిక అంబానీ కలిసి అక్కడున్న సింహం పిల్లకు "లియోనెల్" అని పేరు పెట్టారు, ఇది ఫుట్‌బాల్ లెజెండ్ ఇచ్చిన గౌరవంగా పేర్కొనబడింది.
