AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: రాహుల్ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ కొత్త చీఫ్ ఆయనేనట..! హస్తిన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ

2014లో అధికారం కోల్పోయిన నాటినుంచి ఇప్పటివరకు వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకోచ్చేందుకు అగ్రనేతలు తంటాలు పడుతున్నారు.

Congress: రాహుల్ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ కొత్త చీఫ్ ఆయనేనట..! హస్తిన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ
Congress Political Crisis
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 24, 2022 | 2:08 PM

Share

Congress president election: దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమి సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. 2014లో అధికారం కోల్పోయిన నాటినుంచి ఇప్పటివరకు వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకోచ్చేందుకు అగ్రనేతలు తంటాలు పడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనంతరం ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. అప్పటినుంచి సోనియా గాంధీ తాత్కలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే.. ఇదంతా పార్టీ నాయకత్వ సమస్యగా ఉంటే.. మరొకటి అంతర్గత విబేధాలు కూడా తారాస్థాయికి చేరాయి. ఓ వైపు జీ-7 నేతలను సముదాయిస్తూనే.. మరోవైపు సోనియా పార్టీ బరువు బాధ్యతలను మోస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో.. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం, 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు పార్టీ అగ్రనేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదంతా ఒకటైతే.. మరొకటి నాయకత్వ లేమి కాంగ్రెస్‌ క్యాడర్‌ను ఇబ్బందుల్లో పడేస్తోంది. 150 ఏళ్ల చరిత్ర.. 60 ఏళ్ళపాటు దేశాన్ని ఏలిన ఘనత ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అన్నింటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా.. 2024 ఎన్నికలే లక్ష్యంతో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ నవ్ సంకల్ప్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు పలు వ్యూహాలను రచించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ ను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం కానుండగా.. దీనికి ఇన్‌ఛార్జ్‌గా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. అయితే.. ఈ యాత్రకు ముందు లేదా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని భావిస్తోంది. పూర్తిగా సెప్టెంబర్‌ 21 నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ నిరాకరిస్తే.. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆసక్తికరంగా సోనియా సమావేశం.. 

2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ నిరాకరిస్తూ వస్తున్నారు. మరోవైపు, ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అగ్రనేతలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఓ వైపు వయసు మీద పడుతుండటం, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సోనియా.. కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. తమ కుటుంబానికి విధేయుడైన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పలు వార్తలు కూడా వెలువడుతున్నాయి. రాహుల్ ఒప్పుకోకపోతే.. సోనియా ఎవరికి పదవి ఇస్తారు.. అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో అశోక్ గెహ్లాట్ ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మెడికల్ చెకప్, చికిత్స కోసం విదేశాలకు వెళ్లే ముందు బాధ్యతలు స్వీకరించాలని సోనియా గాంధీ.. అశోక్ గెహ్లాట్‌ను అభ్యర్థించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని సోనియా గాంధీ స్వయంగా అశోక్ గెహ్లాట్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో సోనియా.. గెహ్లాట్‌తో పలువిషయాలపై చర్చించారు. అయితే.. దీనిని మాత్రం గెహ్లాట్ శిబిరం ద్రువీకరించలేదు.

ఇవి కూడా చదవండి

రాహులే కరెక్ట్ అంటున్న గెహ్లాట్..

కాగా.. అశోక్‌ గెహ్లాట్‌ మాత్రం రాహుల్‌ గాంధే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని, ఆయన అయితేనే పార్టీని పునర్మించగలరంటూ పేర్కొన్నారు. ఇది పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుంది. పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే ఆలోచనకు తాను విముఖంగా ఉన్నానని.. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కరెక్ట్ అంటూ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నిరాకరిస్తే.. పార్టీ అగ్రనేతల ఏకాభిప్రాయం తర్వాత కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే షెడ్యూల్‌ను ప్రకటించడానికి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదం కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ లేకపోతే.. పార్టీ బాధ్యతలను స్వీకరించే రేసులో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అలాంటివారిలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఉన్నారని సమాచారం.

అలాగే రాహుల్ గాంధీ కాదంటే.. అధ్యక్షుడి బాధ్యతలు గెహ్లాట్ చేపడతారంటూ మీడియాలో వస్తున్న కధనాలపై కూడా ఆయన స్పందించారు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని.. ఇలాంటివి నమ్మొద్దని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కరెక్ట్ అని.. తాను ఆ రేస్‌లో లేనని వెల్లడించారు. 

బలవంతం ఏం లేదు.. దిగ్విజయ్..

కాగా.. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటే.. ఎవరూ బలవంతం చేయలేరంటూ పేర్కొన్నారు. ఓ వైపు G-23 నేతల అసమ్మతి మధ్యలోనే కాంగ్రెస్.. పార్టీ కీలక బాధ్యతలను అప్పజెప్పేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ తరుణంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఎలా ఉంటుంది..? అనే విషయంపై హస్తిన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..