Indian Railways: రైల్వే ప్రయాణీకులు అలెర్ట్.. ఆ రైల్వే స్టేషన్ పేరు మారింది..
ఔరంగాబాద్ నగరం పేరు మారిన తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు కూడా అధికారికంగా మారిపోయింది. మొఘల్ రాజు ఔరంగజేబు పేరును తొలగించి, మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పేరును ఈ స్టేషన్‌కు పెట్టారు. ఇది నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పేరు మార్పు జరిగింది.

మహారాష్ట్రలోని చారిత్రక ఔరంగాబాద్ నగరం పేరు మారిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అక్కడి రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇకపై ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా పిలవనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కొత్త స్టేషన్ కోడ్ CPSN అని రైల్వే తెలిపింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరం.. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు, మరాఠా రాష్ట్రానికి రెండవ పాలకుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా ఈ కొత్త పేరును పెట్టారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చిన తర్వాత రైల్వే స్టేషన్ పేరు మార్పు జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసి స్టేషన్ పేరు మార్పును త్వరగా పూర్తి చేయాలని కోరారు.
రైల్వే స్టేషన్ చరిత్ర
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900 సంవత్సరంలో హైదరాబాద్ 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ప్రారంభించారు. నాటి నుండి ఈ స్టేషన్ మరాఠ్వాడా ప్రాంతంలో ఒక ముఖ్యమైన జంక్షన్‌గా సేవలను అందిస్తోంది. ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్‌గా పిలవబడుతున్న ఈ నగరం ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. దీని చుట్టూ అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అజంతా, ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఈ రెండూ యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. మొఘల్ శకానికి చెందిన చారిత్రక బీబీ-కా-మక్బరా వంటివి కూడా ఈ నగరంలో ఉన్నాయి. ప్రయాణికులు, సాధారణ ప్రజలు ఇకపై రైల్వే అధికారిక సమాచారం, బోర్డులు, రైలు టికెట్లపై ఈ స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ (CPSN) గా గుర్తించాలని రైల్వే అధికారులు కోరారు.
The Name of “Aurangabad” Railway Station Changed as “CHHATRAPATI SAMBHAJINAGAR” Railway Station@drmned @drmsecunderabad @drmhyb @drmvijayawada @drmgnt @drmgtl @RailMinIndia @Central_Railway @WesternRly pic.twitter.com/sjKeZD1Hdb
— South Central Railway (@SCRailwayIndia) October 25, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




