Garlic Growing: మీ డబ్బులు సేఫ్.. ప్లాస్టిక్ కవర్లో ఆర్గానిక్ వెల్లుల్లి పండించే సింపుల్ ట్రిక్..
వంటింట్లో వెల్లుల్లి లేనిదే ఏ వంటకానికీ రుచి రాదు. అయితే ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో లభించే వెల్లుల్లి రసాయనాల ప్రభావంతో సాగు చేయబడుతోంది. దీనివల్ల ఆరోగ్యం మాట దేవుడెరుగు.. ఉన్న ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. మీకు పెరడు లేకపోయినా, అతి తక్కువ స్థలంలో.. అంటే కేవలం ప్లాస్టిక్ సంచులు లేదా పాత సీసాల సహాయంతో కిలోల కొద్దీ తాజా వెల్లుల్లిని మీరే స్వయంగా పండించుకోవచ్చు. రసాయనాలు లేని స్వచ్ఛమైన వెల్లుల్లిని సాగు చేసే సులభమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

నగరాల్లో నివసించే వారికి మొక్కలు పెంచాలన్నా, కూరగాయలు సాగు చేయాలన్నా స్థలం పెద్ద సమస్య. కానీ వెల్లుల్లి పండించడానికి మీకు పెద్ద తోట అక్కర్లేదు. మన ఇంట్లో ఉండే పాత ప్లాస్టిక్ డబ్బాలు లేదా బస్తాలను ఉపయోగించి ఒకేసారి 1.5 నుండి 2 కిలోల వరకు దిగుబడిని సాధించవచ్చు. దీనివల్ల మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా, తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన ఆహారాన్ని పొందవచ్చు. పట్టణవాసులకు ఎంతో ఉపయోగం. ప్రస్తుత మార్కెట్ ధరల నేపథ్యంలో వెల్లుల్లి సాగు లాభదాయకంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
మట్టిని సిద్ధం చేసే విధానం: మొక్క ఎదుగుదలకు నాణ్యమైన మట్టి చాలా ముఖ్యం. సాధారణ మట్టికి కంపోస్ట్ ఎరువును జోడించి, అందులో కొద్దిగా బూడిదను కలపాలి. బూడిద కలపడం వల్ల ఫంగస్ దరిచేరదు.. మట్టిలో తేమ సరిగ్గా ఉంటుంది. ఈ మూడింటిని బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి.
నాటడం ఎలా?: గట్టిగా ఉండే ఒక ప్లాస్టిక్ సంచిని తీసుకుని సిద్ధం చేసిన మట్టితో నింపాలి. స్క్రూడ్రైవర్ సహాయంతో సంచి చుట్టూ రెండు అంగుళాల దూరంలో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి, వేర్ల భాగం లోపలికి ఉండేలా, ఆకులు వచ్చే భాగం బయటకు ఉండేలా ఆ రంధ్రాలలో నాటాలి.
నీటి పారుదల, పోషణ:
ఒక ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగాన్ని కత్తిరించి, మూత తీసేయాలి. దీన్ని సంచి మధ్యలో ఒక రంధ్రం తవ్వి లోపలికి పెట్టాలి. దీనివల్ల నీరు పోసినప్పుడు అది నేరుగా మట్టిలోని లోపలి పొరల వరకు వెళ్లి తేమను అందిస్తుంది.
సంచి పైభాగంలో పచ్చి శనగలను చల్లవచ్చు. ఇవి మొలకెత్తినప్పుడు సహజ ఎరువుగా పనిచేస్తాయి.
లాభాలు: సాధారణంగా 250 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను ఈ పద్ధతిలో నాటితే, మూడు నెలల్లో 1.5 నుండి 2 కిలోల వరకు దిగుబడిని సాధించవచ్చు. తద్వారా మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పుడు కూడా మీరు తాజాగా, రసాయనాలు లేని వెల్లుల్లిని వాడుకోవచ్చు.
