పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. మస్తు రిలాక్స్ గా ఉంటుంది
పీరియడ్స్ టైంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక, శారీరక సమస్యలు తలెత్తటం సహజం. అటువంటి సమయంలో కొంత మంది చిరాకు, అలసటతో బాధపడుతారు. అయితే కొన్ని సహజ మార్గాలు పాటిస్తే ఆ అసౌకర్యం నుంచి రిలీఫ్ పొందవచ్చు. కడుపు దిగువ భాగంలో నొప్పి, అసౌకర్యం ఉన్నప్పుడు హీట్ ప్యాడ్ ఉపయోగించటం వల్ల అక్కడ రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా.. మనసు కాస్త రిలాక్స్ అవ్వడంలో కూడా సహాయపడుతుంది. రోజులో కొన్ని నిమిషాలు ఈ పద్ధతిని ఫాలో అయితే ఉపశమనం కనిపిస్తుంది.

నెలసరి అప్పుడు ఒంట్లో నీటి లెక్క తేడా అయితే కడుపు ఉబ్బినట్టు ఉండటం, శరీరం నీరసంగా మారటం లాంటి ఇబ్బందులు వస్తాయి. రోజంతా తగినన్ని సార్లు నీళ్లు తాగితే అవి తగ్గుతాయి. కొబ్బరి బొండాల నీరు, నిమ్మరసం కలిపిన నీరు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. లావెండర్, చామంతి వంటి నూనెలతో కడుపు చుట్టూ నెమ్మదిగా మసాజ్ చేస్తే తిమ్మిరి తగ్గుతుంది. ఈ నూనెల సుగంధం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గడంతో పాటు మనసుకు కూడా మంచిగా అనిపిస్తుంది.
యోగా, వాకింగ్ లాంటి తేలికైన వ్యాయామాలు చేయటం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. చిరాకు తక్కువయ్యేలా చేయడానికి కూడా ఇది ఒక మంచి మార్గం.
మెగ్నీషియం ఉండే ఫుడ్ తినండి. మెగ్నీషియం అనే పోషకం కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. పాలకూర, బాదం, మంచి కొవ్వులున్న గింజల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒంట్లోని వాపును తగ్గించడంతో పాటు బలాన్ని ఇస్తాయి.
సహజంగా చేసిన టీలు తాగండి. పుదీనా, చామంతి లాంటి మంచి వాసన ఉండే టీలు కండరాలను ఫ్రీగా ఉంచుతాయి. వాటిలో ఉండే నొప్పిని తగ్గించే గుణాలు నొప్పిని తగ్గిస్తాయి. రోజుకు రెండు సార్లు ఈ టీ తాగితే మనసుకు కూడా హాయిగా ఉంటుంది.
టొమాటోలు, క్యారెట్, బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు వంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పదార్థాలు తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే అసౌకర్యాలు తగ్గుతాయి. శరీరం తేలికగా ఉండటంతో పాటు చిరాకు కూడా తగ్గుతుంది.
డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రోజుకు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని లోతుగా ఊపిరి తీసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది.
కాఫీ, టీ, చాక్లెట్ లలో ఉండే కెఫిన్ మూడ్ స్వింగ్స్ కి కారణం కావచ్చు. ఇవి అధికంగా తీసుకుంటే మానసికంగా అసహనం పెరుగుతుంది. అందుకే నెలసరి సమయంలో ఈ పదార్థాల నుంచి దూరంగా ఉండటం మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే నెలసరి సమయంలో వచ్చే చిరాకు, నొప్పిని సహజంగా తగ్గించుకోవచ్చు.