Brain Stroke: యువతను భయపెడుతున్న బ్రెయిన్ స్ట్రోక్.. నివారణ మన చేతుల్లోనే..! ఏం చేయాలంటే
నేటి కాలంలో అధికమంది జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు వంటి వాటిల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఒకప్పుడు వృద్ధులకు వచ్చే ఈ భయానక వ్యాధి.. ప్రస్తుతం యువతకు కూడా సంభవిస్తుంది. దీని నివారణకు ప్రముఖ నిపుణులు కొన్ని నివారణ మార్గాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గత కొన్నేళ్లుగా మన దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గత 10 ఏళ్లలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 20 శాతం పెరిగాయి. నేటి కాలంలో యువత కూడా బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. దీనిని యంగ్-ఆన్సెట్ స్ట్రోక్ అంటారు. ఇందులో 45 ఏళ్లలోపు వారు కూడా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. అన్ని స్ట్రోక్ కేసులలో 10 నుండి 15% వరకు యంగ్-ఆన్‌సెట్ స్ట్రోక్‌లు ఉన్నాయి. పేలవమైన జీవనశైలి అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే అధికమంది స్ట్రోక్ బారీన పడుతున్నారు.
చెడు జీవనశైలి కారణంగా.. వచ్చ ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు, మధుమేహం ముఖ్యమైనవి. ధూమపానం, వర్క్ సంబంధిత మానసిక ఒత్తిడి వంటి చెడు జీవనశైలి అలవాట్లు కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవుతున్నాయి. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. యువతలో స్ట్రోక్‌కు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదే యాంటీ క్లాటింగ్ మెకానిజం సమస్య. ఇది హైపర్‌కోగ్యులబుల్ కండిషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టినప్పుడు, స్ట్రోక్ సంభవిస్తుంది. చెడు జీవనశైలి వల్ల యువతలో కూడా మెదడులో గడ్డలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
స్ట్రోక్ ప్రాణాంతకమా..?
స్ట్రోక్‌కు సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారుతుందని మణిపాల్ ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో డాక్టర్ సంతోష్ ఎన్‌ఎస్ చెబుతున్నారు. అస్పష్టమైన దృష్టి, మైకం, తీవ్రమైన తలనొప్పి వంటివి స్ట్రోక్ లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. ఈ విషయంలో అజాగ్రత్త తగదు. బ్రెయిన్ స్ట్రోక్ సమస్య సకాలంలో చికిత్స అందించదం ద్వారా అదుపులో ఉంచవచ్చు.
స్ట్రోక్‌ను ఎలా నివారించాలి?
స్ట్రోక్ రాకుండా ఉండాలంటే మధుమేహం, హైబీపీ వంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. షుగర్ లెవెల్, బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు తలనొప్పి సమస్య ఉంటే దానిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పి కొన్ని సందర్భాల్లో స్ట్రోక్ ప్రారంభ సంకేతంగా ఉంటుంది.