సంపూర్ణ పోషకాలు అందాలంటే పచ్చిగా తినాల్సిందే అంటున్న నిపుణులు! ఇంతకీ ఆ కూరగాయలేవో తెలుసా?
ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు తమ ఆహారంలో రకరకాల కూరగాయలను భాగం చేసుకుంటారు. అయితే, కూరగాయలు వండుకుని తినడం వల్ల వాటిలోని పోషకాలు గరిష్టంగా శరీరానికి అందుతాయని చాలామంది భావిస్తారు. కానీ, ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని కూరగాయలను ..

ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు తమ ఆహారంలో రకరకాల కూరగాయలను భాగం చేసుకుంటారు. అయితే, కూరగాయలు వండుకుని తినడం వల్ల వాటిలోని పోషకాలు గరిష్టంగా శరీరానికి అందుతాయని చాలామంది భావిస్తారు. కానీ, ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని కూరగాయలను వండటం వల్ల, ముఖ్యంగా అధిక వేడికి గురి చేయడం వల్ల వాటిలోని కీలకమైన పోషకాలు, ఎంజైమ్‌లు గణనీయంగా తగ్గిపోతాయి. అందుకే, వాటి పూర్తి ప్రయోజనాలను పొందాలంటే, ఆ కూరగాయలను పచ్చిగా తినడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇంతకీ పచ్చిగానే తినాల్సిన కూరగాయలేవో తెలుసుకుందాం..
రెడ్ బెల్ పెప్పర్
రెడ్ బెల్ పెప్పర్‌లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి చాలా కీలకం. అయితే, అధిక వేడికి గురైనప్పుడు ఇందులోని విటమిన్ సి స్థాయిలు చాలా వరకు పడిపోతాయి. ఉడకబెట్టినా, ఆవిరి చేసినా పోషకాలు కోల్పోతాయి. అందుకే రెడ్ బెల్ పెప్పర్‌ను సలాడ్‌ల రూపంలో పచ్చిగా తిన్నప్పుడే గరిష్ఠ స్థాయిలో విటమిన్ సి, ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి.
బ్రొకోలీ
బ్రొకోలీని కేన్సర్‌తో పోరాడే ఆహారంగా పరిగణిస్తారు. దీనికి కారణం, ఇందులో ఉండే ప్రత్యేకమైన మైరోసినేస్ అనే ఎంజైమ్. అధిక వేడిలో ఈ ఎంజైమ్ నిష్క్రియంగా మారిపోతుంది. దాంతో, బ్రొకోలీలోని కేన్సర్ నిరోధక గుణాలు శరీరానికి అందకుండా పోతాయి. వండిన బ్రొకోలీతో పోలిస్తే.. పచ్చి బ్రొకోలీలోనే సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ 10 రెట్లు ఎక్కువగా లభిస్తుంది.
వెల్లుల్లి
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని వేడి చేయడం వల్ల ఇందులోని ముఖ్యమైన సమ్మేళనాలైన అల్లిసిన్, ఆర్గానోసల్ఫర్ పాక్షికంగా నాశనం అవుతాయి. అందువల్ల వెల్లుల్లి పూర్తి ప్రయోజనాలు అందాలంటే, దానిని పచ్చిగా తినడమే ఉత్తమం.
ఉల్లిపాయ
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఎక్కువసేపు వేడి చేసినప్పుడు ఉల్లిపాయల్లోని క్వెర్సెటిన్, సల్ఫర్ సమ్మేళనాలు దెబ్బతింటాయి. సాధారణ వంట పద్ధతుల్లోనూ కొన్ని ఫ్లేవనాయిడ్లు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. అందువల్ల పచ్చి ఉల్లిపాయలను సలాడ్‌లు లేదా డ్రెస్సింగ్‌లలో తీసుకుంటే అధిక స్థాయిలో ఫైటోన్యూట్రియెంట్లు శరీరానికి అందుతాయి. మనం తినే ఆహారం పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను అందించాలంటే, ఈ కూరగాయలను పచ్చిగా తినే అలవాటు చేసుకోవడం మంచిది.




