SNORING: గురక సమస్యను ఈజీగా తగ్గించే చిట్కాలు.. నిద్రలో శ్వాస ఆగిపోయే ప్రమాదాన్ని తప్పించే టెక్నిక్స్!
మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా రాత్రిపూట బిగ్గరగా గురక పెడుతున్నారా? గురక కేవలం ఇతరుల నిద్రకు భంగం కలిగించడమే కాదు, ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన కావచ్చు. నిద్రలో శ్వాస ఆగిపోయే ప్రమాదకరమైన సమస్య స్లీప్ అప్నియా ..

మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా రాత్రిపూట బిగ్గరగా గురక పెడుతున్నారా? గురక కేవలం ఇతరుల నిద్రకు భంగం కలిగించడమే కాదు, ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన కావచ్చు. నిద్రలో శ్వాస ఆగిపోయే ప్రమాదకరమైన సమస్య స్లీప్ అప్నియా కూడా ఇది సూచన కావచ్చు. అయితే, ఈ గురక సమస్యను తగ్గించుకోవడానికి వైద్య నిపుణులు సూచించే ఒక సులువైన, ఖర్చు లేని మార్గం ఉంది.. అదే నాలుకతో చేసే వ్యాయామాలు. గురకను నియంత్రించే ఆ వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకుందాం..
నిద్రపోతున్నప్పుడు, మన శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి, నాలుక కండరాలు కూడా వదులుగా మారతాయి. కొంతమందిలో ఈ నాలుక కండరాలు వదులై గొంతు వెనుక భాగాన్ని అడ్డుకోవడం లేదా వెనక్కి జారడం జరుగుతుంది. దీనివల్ల శ్వాస మార్గంలో ఇరుకు ఏర్పడి, గాలి ప్రవహించేటప్పుడు కణజాలం కంపించి, గురక శబ్దం వస్తుంది.
నాలుక వ్యాయామాలు ఈ కండరాలను దృఢంగా మార్చి, నిద్రలో వెనక్కి జారకుండా నిరోధించడంలో సహాయపడతాయి. గురక సమస్యను తగ్గించడానికి రోజూ కేవలం కొన్ని నిమిషాలు ఈ వ్యాయామాలను అభ్యసించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మీరు మీ నాలుకను నోటిలో సాధ్యమైనంత వరకు పైకి సాగదీసి, ముక్కు చివరి భాగాన్ని తాకించడానికి ప్రయత్నించండి. అలాగే నాలుకను బుగ్గల లోపలి వైపుల నుంచి గట్టిగా అవతలి వైపుకు నెట్టడానికి ప్రయత్నించండి. ప్రతి వ్యాయామాన్ని 20 సెకండ్ల చొప్పున 10 సార్లు చేయాలి.
ఈ సాధారణ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం ద్వారా, నాలుక కండరాలు దృఢంగా తయారవుతాయి. ఫలితంగా, నిద్రలో నాలుక వెనక్కి జారడం తగ్గి, శ్వాస మార్గం స్పష్టంగా ఉండి గురక తీవ్రత తగ్గుతుంది. గురకను తగ్గించడానికి నాలుక వ్యాయామాలు సహాయపడినప్పటికీ, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గురకతో పాటు, నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోవడం వంటి లక్షణాలు ఉంటే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే, నిద్రిస్తున్నప్పుడు సీప్యాప్ (CPAP) పరికరాన్ని ధరించాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ చర్యల ద్వారా గురకను తగ్గించుకోవడమే కాకుండా, స్లీప్ అప్నియా వల్ల మున్ముందు తలెత్తే అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి ప్రమాదకరమైన జబ్బులను నివారించుకునే అవకాశం ఉంటుంది.
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




