Head Bath: రాత్రిళ్లు తల స్నానం చేస్తున్నారా? ఫలితం ఏంటో తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు
నల్లగా నిగనిగలాడే పట్టులాంటి జుట్టుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జుట్టు సంరక్షణ విషయంలో చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు.. తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరిపోకుండానే నిద్రపోవడం. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా తలస్నానం చేసేవారికి ఈ అలవాటు ..

నల్లగా నిగనిగలాడే పట్టులాంటి జుట్టుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జుట్టు సంరక్షణ విషయంలో చాలా మంది చేసే ఒక సాధారణ తప్పు.. తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరిపోకుండానే నిద్రపోవడం. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా తలస్నానం చేసేవారికి ఈ అలవాటు సర్వసాధారణం. అయితే, ఈ అలవాటు వల్ల మీ జుట్టుకు, తల చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుంటే, ఈ అలవాటును వెంటనే మానేస్తారు.
జుట్టు తడిగా ఉన్నప్పుడు అది అత్యంత బలహీనంగా, సున్నితంగా మారుతుంది. నీళ్లు జుట్టు బయటి పొర లోపలికి చొచ్చుకుపోయి, జుట్టు నిర్మాణంపై ఒత్తిడిని పెంచుతుంది. మనం నిద్రపోయేటప్పుడు తలగడ, తడి జుట్టు మధ్య నిరంతర రాపిడి జరుగుతుంది. ఈ రాపిడి కారణంగా జుట్టు సులభంగా సాగిపోతుంది, చిక్కులు పడుతుంది, డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోయే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగడానికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది.
తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల తలగడ, తల చర్మం తేమగా ఉండిపోతాయి. ఈ వెచ్చని, తేమతో కూడిన వాతావరణం శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనువైన క్షేత్రంగా మారుతుంది. తల చర్మంపై సహజంగా ఉండే మాలాసెజియా అనే ఫంగస్ తేమ వాతావరణంలో వేగంగా పెరుగుతుంది. ఇది చుండ్రు పెరగడానికి ప్రధాన కారణం. స్కాల్ప్‌లో ఇన్ఫెక్షన్లు, చుండ్రు వల్ల తరచుగా దురద, ఎరుపుదనం, చికాకు కలుగుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా పెరగడం వల్ల తల చర్మం నుంచి చెడు వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, తడి జుట్టు మీ తలగడ కవర్‌ను కూడా తడి చేస్తుంది. తలగడ కవర్లలో నిలిచిపోయే తేమ వల్ల బ్యాక్టీరియా, ధూళి కణాలు సులభంగా పెరుగుతాయి. ఇది మీ ముఖ చర్మానికి హాని కలిగించి, మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ అలవాటును వెంటనే మానేయడం ఉత్తమం. నిద్రించడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. సహజంగా గాలికి ఆరిపోయేలా చేయండి. అత్యవసరమైతే, తక్కువ వేడితో హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి జుట్టు మూలాలను బాగా ఆరబెట్టండి. ఒకవేళ తప్పనిసరి అయితే, కాటన్ కవర్ల కంటే తక్కువ రాపిడిని కలిగించే సిల్క్ లేదా శాటిన్ తలగడ కవర్‌లను ఉపయోగించండి. జుట్టు ఆరిన తర్వాత, చిక్కులు పడకుండా ఉండేందుకు వదులుగా జడ వేసుకోవడం మంచిది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. తడి జుట్టుతో నిద్రపోయే అలవాటుకు వీలైనంత త్వరగా స్వస్తి చెప్పడం చాలా ముఖ్యం.




