Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత ఘోరం: 3 రోజుల క్రితం కుమారుడు మృతి చెందినా.. గుర్తించలేక మృతదేహంతోనే అంధ తల్లిదండ్రులు

వ్యసనాలకు అలవాటుపడ్డ కొడుకు ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రలోనే మరణించాడు. ఈ విషయం తెలియక చూపులేని వృద్ధ తల్లిదండ్రులు కుమారుడు వచ్చి తమకు ఇంత అన్నం పెడతాడని ఎదురు చూడసాగారు. అలా సుమారు మూడు రోజులకుపైగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ నీరసించి పోయిన ఆ వృద్ధ జంట కుమారుడి మృతదేహం తమ పక్కనే పడిఉందన్న విషయం గ్రహించలేకపోయారు..

అయ్యో ఎంత ఘోరం: 3 రోజుల క్రితం కుమారుడు మృతి చెందినా.. గుర్తించలేక మృతదేహంతోనే అంధ తల్లిదండ్రులు
Blind Parents Unaware Of Their Sons Dead Body At Home
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 29, 2024 | 9:46 AM

నాగోలు, అక్టోబర్‌ 29: ఇంట్లో కుమారుడు మూడు రోజుల క్రితం మృతి చెందినా ఆ ఆంధ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. కొడుకు వచ్చి తమకు భోజనం పెడతాడని ఆకలితో అలమటిస్తూనే ఎదురు చూడసాగారు. కానీ తమ పక్కనే కొడుకు మృత దేహం ఉందనే విషయాన్ని ఆ అంధ వృద్ధ దంపతులు తెలుసుకోలేకపోయారు. ఇంట్లో దుర్వాసన వస్తుంటే ఎలుకో, పిల్లో చనిపోయి ఉంటుందని అనుకున్నారేగానీ.. తమ కన్నబిడ్డే మృతి చెందాడని తెలుసుకోలేకపోయారు. ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ద జంట మూడు రోజులుగా ఇంటి బటయకు రాకపోవడం.. పైగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారం అందిచడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ హృదయ విదరాక ఘటన హైదరాబాద్‌ నాగోలు ఠాణా పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…

తెలంగాణలోని నాగోలు జైపూర్‌కాలనీ సమీప అంధుల కాలనీలోని ఓ అద్దె ఇంట్లో గత నలభై ఏళ్లుగా కలువ రమణ (59), శాంతికుమారి (64) దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ కంటి చూపు లేదు. రమణ ట్రైబల్‌ వెల్ఫేర్‌లో ఉద్యోగి. అక్కడి ప్రభుత్వ వసతిగృహంలో కిందిస్థాయి ఉద్యోగి. రమణకు కంటి చూపు లేక పోవడంతో వేరే వ్యక్తిని తన ఉద్యోగంలో సహాయకుడిగా పెట్టుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్‌.. తన భార్యతో కలిసి వేరు కాపురం ఉంటున్నాడు. చిన్న కుమారుడు ప్రమోద్‌ (32) తన భార్యతో కలిసి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ప్రమోద్‌ పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్న పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల ప్రమోద్‌ మద్యానికి బానిస కావడంతో నాలుగు రోజుల క్రితం అతడి భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

నాటి నుంచి ప్రమోద్‌ పనిమానేసి, తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మద్యం తాగి వచ్చిన ప్రమోద్‌కుమార్‌కు ఫిట్స్‌ రావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. కంటి చూపులేని రమణ, శాంతకుమారి కుమారుడు తమ కళ్ల ఎదుటే చనిపోయి పడి ఉన్న విషయాన్ని గుర్తించ‌లేకపోయారు. కుమారుడు వస్తాడు.. తమకు భోజనం పెడతాడని ఎదురు చూడసాగారు. బయటకు వచ్చేందుకు శక్తి లేక.. అదే ఇంట్లో మృతదేహంతో మూడు రోజులకుపైగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

సహాయం కోసం అరిచినా వారి గొంతు బయటికి వినిపించలేనంత నీరసించిపోయారు. దీంతో స్థానికులకు కూడా తెలియలేదు. సోమవారం మధ్యాహ్నం వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఒంటి గంట సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తీసి చూడగా.. లోపలి దృశ్య వారిని కలచివేసింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం.. ఆ పక్కనే మంచంపై తల్లిని, కొద్దిదూరంలో తండ్రిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మూడు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు వారికి ఆహారం అందించి, పెద్ద కుమారుడికి సమాచారం ఇచ్చి రప్పించారు. అతడు వచ్చాక తల్లిదండ్రులను అతడికి అప్పగించి, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.