Bhala Thandanana : కాస్త ఓపిగ్గా చూడగలిగితే… `భళా తందనాన`
సినిమా హీరోల పేర్లు చెప్పగానే, వాళ్ల టేస్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి కథలకు వాళ్లు టిక్ మార్కు పెడతారో సగటు సినీ ప్రేక్షకుడికి కొత్తగా చెప్పక్కర్లేదు.
సినిమా హీరోల పేర్లు చెప్పగానే, వాళ్ల టేస్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి కథలకు వాళ్లు టిక్ మార్కు పెడతారో సగటు సినీ ప్రేక్షకుడికి కొత్తగా చెప్పక్కర్లేదు. దాన్నిబట్టి.. శ్రీవిష్ణు ఓ కథకు సైన్ చేశారంటేనే అందులో ఏదో ఉండి తీరుతుందనే అంచనా ప్రేక్షకుల్లో తప్పక కలుగుతుంది. ఈ వీక్ రిలీజ్ భళా తందనానతో ఆ ఇమేజ్‌ని శ్రీవిష్ణు కాపాడుకున్నారా? లేదా? ఇంతకీ భళా తందనాన ఎలా ఉంది?… చదివేయండి.
సినిమా: భళా తందనాన
నిర్మాణ సంస్థ: వారాహి చలనచిత్రం
సమర్పణ: సాయి కొర్రపాటి
నిర్మాత: రజనీ కొర్రపాటి
నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్ ట్రెస్సా, రామచంద్రరాజు, పోసాని కృష్ణమురళి, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: మణిశర్మ
కెమెరా: సురేష్ రగుతు
ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్
దర్శకత్వం: చైతన్య దంతులూరి
విడుదల: 5.6.2022
శశిరేఖ (కేథరిన్) క్రైమ్ జర్నలిస్ట్. తనదో అందమైన ప్రపంచం. అయినా వ్యక్తిగతంగానూ,వృత్తి పరంగా ఎన్నో సవాళ్లను సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేస్తుంది. ప్రతిరోజూ భయానకమైన విషయాల మధ్య నడుస్తుంటుంది. కాకపోతే ఈసారి ఆమె డీల్ చేసిన విషయం హవాలా మనీ. ఆ మనీకి సంబంధించిన వ్యక్తి ఆనంద్ బాలి (రామచంద్రరాజు). అతని మనుషులు ముగ్గురు చనిపోతారు. తనది రూపాయి పోతే లక్ష రూపాయలు ఖర్చుపెట్టి తెప్పించుకునే బాలీ మనుషులను చంపింది ఎవరు? బాలి దగ్గర నుంచి రెండు వేల కోట్లను కొల్లగొట్టిందెవరు? అంతకు ముందు కేసులను డీల్ చేసేటప్పుడు ఆమె పక్కన చంద్రశేఖర్ అలియాస్ చందు (శ్రీవిష్ణు) ఉండడు. కానీ బాలీ కేసులో ఆమె పక్కన అతనుంటాడు. చనిపోయిన ముగ్గురినీ తాను చూశానంటాడు. అతనితో కలిసి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని అనుకుంటున్న శశిరేఖకు ఒకానొక సమయంలో… తాను డీల్ చేస్తున్నది అతని కేసునే… అని అర్థమై విస్తుపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అప్పటికే వ్యక్తపరచని ప్రేమలో ఉన్న వారిద్దరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయి? చంద్రశేఖర్ కీ, దయామయం (పోసాని)కి సంబంధం ఏంటి? చందు రూమ్మేట్‌కి తెలిసిన నిజాలేంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
అనాథాశ్రమంలో అమాయకుడైన అకౌంటెంట్‌గా, ఆల్రెడీ పల్లెటూరిలో ఫెయిల్యూర్ లవ్‌స్టోరీ ఉన్న వ్యక్తిగా, శశిరేఖ డేరింగ్‌కి ఆశ్చర్యపోతూ, ఆమెతో మెల్లిమెల్లిగా ప్రేమలో పడ్డ యువకుడిగా శ్రీవిష్ణు నటన బావుంది. అగ్రెసివ్ యంగ్ మ్యాన్‌గా, దయామయాన్ని, ఆనంద్ బాలిని అల్లల్లాడించిన వ్యక్తిగానూ మెప్పించింది. కేథరిన్ కొన్ని సన్నివేశాల్లో బొద్దుగా కనిపించారు. అఫిషియల్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నా, క్లైమాక్స్ లో ఎమోషన్స్ ని సరిగా పండించలేకపోయారు. గరుడ రామ్, పోసాని కృష్ణమురళి, సత్య ఎవరి పాత్రల్లో వాళ్లు మెప్పించారు. ఈ సినిమాకు ప్రాణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మణిశర్మ మార్క్ ఎక్స్ పీరియన్స్ కనిపించింది. ఆయనకు ఫుల్ మార్కులు వేయాల్సిందే. బలహీనుడి ధిక్కారమే, ఘనా ఘనాయోధుడై భళాతందనానా… అంటూ వచ్చే సాంగ్ హీరో కేరక్టర్‌ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తుంది. కెమెరా పనితనం బావుంది. కొన్నిచోట్ల డైలాగులు నవ్విస్తాయి.
సొసైటీలో ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిందే. ఆఖరికి మంచిగా బతకాలన్నా పోరాటం తప్పదు… మంచి పనులు చేసే వాళ్లని వంద విషయాలు అడిగే మనం… చెడు పనులు చేసేవాళ్లని ఎందుకు అడగం…. వంటి మాటలు ఆలోచింపజేస్తాయి. ఒకే రకమైన భావజాలంతో తిరిగే హీరో, హీరోయిన్ల మధ్య ఏం జరిగిందనే కథ… రెండు వేల కోట్లు ఏమయ్యాయనే కథ… ఇంకా మిగిలే ఉందంటూ చివరిలో సీక్వెల్ హింట్ ఇచ్చారు డైరక్టర్.
ఓవరాల్‌గా చూస్తే… కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. ఈ తరహా హీరో కేరక్టరైజేషన్లు మనకి కొత్తేం కాదు. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందే ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. కాబట్టి థ్రిల్లింగ్‌గా లేదు. ఫస్టాఫ్ సోసోగా సాగినట్టు అనిపిస్తుంది. ఈ విషయాలను పట్టించుకోకుండా, కొన్ని ల్యాగులు వదిలేసి ఓపికతో చూస్తే భళా తందనానని ఎంజాయ్ చేయొచ్చు.