Gold Loan Fraud: వడ్డీ లేకుండా గోల్డ్ లోన్.. అసలు మ్యాటర్ తెలిస్తే అల్లాడిపోవాల్సిందే..!
"జీరో వడ్డీకే గోల్డ్ లోన్. ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఏడాది పాటు ఎలాంటి వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ మంజూరు చేస్తాం" అంటూ ఇటీవల మోసాలకు పాల్పడుతున్నారు. వడ్డీ లేకుండా రుణం వస్తుందని ఆశపడి వీరి ఉచ్చులో పడుతున్నారు.

ప్రజలను సులువుగా మోసం చేసేందుకు నేరగాళ్లు కొత్త పద్దతులను అనుసరిస్తున్నారు. ఒక మోసం గురించి ప్రజలు అవగాహన పొందే లోపే.. కొత్త పద్దతిని అవలంభిస్తూ జనాల సొమ్మును కాజేస్తున్నారు. ప్రజలు తెలిసీ తెలియక వీరి ఉచ్చుల్లో పడి తమ నగదు మొత్తం పొగోట్టుకుంటున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ లోన్ పేరుతో ప్రజల సొమ్మును నిలువునా దోచేస్తున్నారు నేరగాళ్లు. వీరి మాయలో పడి కొంతమంది ఉన్నదంతా వీరికి ఉడ్చివేస్తున్నారు. దేశంలో కొత్తగా బయటపడ్డ ఈ గోల్డ్ లోన్ మోసాల గురించి తెలుసుకుందాం.
వడ్డీ లేకుండా గోల్డ్ లోన్
బ్యాంకుల్లో తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటాం. ఇందుకు బ్యాంకులు కొంత మొత్తంలో వడ్డీ వసూలు చేస్తాయి. వడ్డీతో సహా తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాక బ్యాంకులు తిరిగి మన గోల్డ్ ఇచ్చేస్తాయి. గోల్డ్ లోన్‌కు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకుని నేరగాళ్లు చిటికెలో జనాలను మోసానికి గురి చేస్తున్నారు. అసలు వడ్డీ అనేదే లేకుండా గోల్డ్ లోన్ ఇస్తామంటూ కేరళలో ఓ వ్యక్తి మహిళలను మోసం చేశాడు. ఇలాంటి కేసులు ఇటీవల 30 వరకు చోటుచేసుకున్నాయి. వడకుంబాద్‌లోని తొట్టుమ్మెల్‌కు చెందిన మహ్మద్ షిబిల్ అనే వ్యక్తి వడ్డీ లేకుండా గోల్డో లోన్ ఇస్తామంటూ స్థానిక మహిళను మోసం చేశాడు. రూ.2.30 లక్షల లోన్ కోసం మహిళ నుంచి 62.300 గ్రాముల బంగారం తీసుకున్నాడు.
అలాగే మహిళ నుంచి రూ.1.25 లక్షలు కూడా తీసుకున్నాడు. అయితే తాకట్టు పెట్టిన బంగారం తిరిగి రాకపోవడంతో బాధిత మహిళ థర్మాడమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితులు రూ.3 కోట్ల వరకు ఇలా అనేకమంది వ్యక్తులను మోసం చేసినట్లు తేలింది. ఓ సంస్థ ముసుగులో నిందితులు ఈ మోసాలకు పాల్పడినట్లు బయటపడింది. మహ్మద్ షిబిల్ కంపెనీ యజమానుల్లో ఒకడిగా ఉండగా.. మిగతా నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కేరళలోని కోజికడ్‌లో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడిన మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
