AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?

మన జీవనానికి నీరు ఎంతో అవసరం. నిపుణుల సూచన ప్రకారం, ప్లాస్టిక్ బాటిళ్ల కంటే స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నీరు నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు, రాగి, స్టీల్ బాటిళ్లలో ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుందో మనం తెలుసుకుందాం.

Copper Vs Steel bottle: కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?
Copper And Steel Bottle
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 3:28 PM

Share

మన జీవితానికి నీరు ఎంతో అవసరం. నీరు తరచూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనం ఏటైనా బయటకి వెళ్లిన సమయంలో కూడా మన వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళుతుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా వారి వెంట ఒక వాటర్ వాటిల్ ఉండాల్సిందే. లేదంటే బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది.

అయితే, మనం తాగే నీరు ప్లాస్టిక్ బాటిళ్లలో కాకుండా స్టీల్ లేదా కాపర్ బాటిళ్లలో నిల్వ చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు హానికరం కాబట్టి వాటిని వాడవద్దని అంటారు. అయితే, రాగి లేదా స్టీల్ బాటిళ్లలో ఏది ఎక్కువ మనకు ప్రయోజనాన్ని ఇస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి బాటిల్‌లో నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు?

పురాతన కాలం నుంచి రాగికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద వైద్యంలో రాగిని ఔషధ, యాంటీమైక్రోబయల్ లక్షణాల కోసం ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రలో నీటిని 6 నుంచి 8 గంటలు నిల్వ చేయడం వల్ల నీటిలోకి రాగి అవశేషాలు విడుదలవుతాయి. రాగి బాటిల్ నుంచి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగికి సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు హానికర బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి రాగి సీసా నుంచి నీరు తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది హర్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అంతేగాక, రాగి బాటిల్స్ ఫ్రీరాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.

బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలి?

మీరు రాగి బాటిల్‌ను ఉపయోగిస్తుంటే.. దానిని క్రమానుగతంగా నిమ్మకాయ, ఉప్పు లేదా వెనిగర్‌తో శుభ్రం చేయండి. ఇది ఆక్సీకరణను నివారిస్తుంది. తిరిగి ఉపయోగించే ముందు బాగా కడిగి ఆరబెట్టండి. పదునైన వస్తువులను వాడితే బాటిల్ దెబ్బతింటుంది. అందుకే జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

స్టీల్ వాటర్ బాటిల్ ప్రయోజనం

స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లలో రాగి సీసాలో ఉన్నంత పోషకాలు ఉండవు. కానీ, ఇవి నీటిని నిల్వ చేయడానికి సురక్షితమైనవి. పరిశుభ్రమైన మార్గంగా చెప్పవచ్చు. స్టీల్ బాటిళ్లు.. ప్లాస్టిక్ బాటిళ్ల వంటి హానికరమైన రసాయానాలతో నీటిని కలుషితం చేయవు. స్టీల్ బాటిళ్లలో నీరు సురక్షితంగా ఉంటుంది. కొన్ని స్టీల్ బాటిళ్లలో నీటిని ఎక్కువ సేపు వేడిగా లేదా చల్లగా ఉంచే ఇన్సులేషన్ ఉంటుంది. స్టీల్ బాటిళ్లు 100శాతం పునర్వినియోగించదగినివి, పర్యావరణానికి మేలు చేస్తాయి.

ఇక స్టీల్ బాటిళ్లను శుభ్రం చేయడం చాలా సులభం. ఇవి రాగి బాటిళ్ల కంటే మరకలు, వాసనలకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి.

గుర్తుంచుకోవలసిన విషయాలు: రాగి vs స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు రాగి బాటిళ్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు సాధారణంగా సురక్షితంగా ఉన్నా, వాటిని జాగ్రత్తగా వాడటం అవసరం.

రాగి బాటిళ్లు వాడేటప్పుడు జాగ్రత్తలు: ఎక్కువ రాగి తీసుకోవడం వల్ల వికారం, వాంతులు లేదా కాలేయానికి హానికరంగా ఉండవచ్చు. అందుకే రాగిని సీసాలో నిల్వ చేసిన నీటిలో పరిమితంగా ఉంచండి. రాగి బాటిళ్లలో ఆమ్ల పదార్థాలు నిల్వ చేయడం అధిక రాగి లీచింగ్‌కు కారణమవుతుంది. ఉదాహరణకి, రాగి బాటిల్‌లో నిమ్మరసం వేసి తాగితే విరేచన సమస్యలు రావచ్చు. కాలక్రమేణా రాగి బాటిళ్లు ఆక్సీకరణం చెందుతాయి, కాబట్టి వాటిని శుభ్రంగా, జాగ్రత్తగా నిర్వహించాలి.

స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు వాడేటప్పుడు జాగ్రత్తలు: స్టెయిన్‌లెస్ స్టీల్‌లో నికెల్ ఉంటుంది, ఇది కొంతమందికి అలెర్జీ సమస్యలకు కారణం కావచ్చు. తక్కువ నాణ్యత గల స్టీల్ బాటిళ్లు కాలంతో తుప్పు పట్టవచ్చు. కాబట్టి ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ (304 లేదా 316 గ్రేడ్) ఎంచుకోవడం ముఖ్యం. స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్ ఎటువంటి అదనపు పోషకాలను అందించదు.

ఏది ఆరోగ్యానికి మంచిది? రాగి బాటిల్: రాగి పోషకాలను పొందాలనుకుంటే, ఇది మంచి ఎంపిక. కానీ దీనిని క్రమం తప్పకుండా శుభ్రం చేసి, సరిగ్గా వాడాలి.

స్టీల్ బాటిల్: తక్కువ నిర్వహణ, మన్నికైన, ప్రయాణం, ఆఫీస్ వినియోగానికి అనువైనది. పోషకాలను లీక్ చేయకుండా సురక్షితంగా ఉంటుంది. మీకు తక్కువ నిర్వహణ మన్నికైన బాటిల్ కావాలంటే స్టీల్ బాటిల్ మంచి ఎంపిక. ప్రయాణానికి, ఆఫీసు వినియోగానికి స్టీ్ల బాటిళ్లు సరైనవి. ఇక, క్రమం తప్పకుండా శుభ్రం చేసి సరిగ్గా ఉపయోగించాలనుకుంటే.. రాగి బాటిల్‌ను ఎంపిక చేసుకోవచ్చు.