Andhra News: అధిక వడ్డీల ఆశ చూపాడు.. అందినకాడికి దోచేశారు.. వెలుగులోకి భారీ స్కామ్!
రాష్ట్రంలో మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వందల కోట్లు డిపాజిట్లు రూపంలో అధిక వడ్డీల ఆశ చూపి.. భారీగా డబ్బులు వసూలుచేసింది. చివరకు అందినకాడికి దోచుకొని పత్తాలేకుండా పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలంగా మారడంతో సదర్ ఫైనాన్సు సంస్థ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో దీనిపై సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అధిక వడ్డీలు ఆశ చూపి బోర్డు తిప్పేసిన శ్రేయస్ ఇన్ఫ్రా కంపెనీపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి దాదాపు 206 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది కర్నూలులోని శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. భారీ కుంభకోణం నేపథ్యంలో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం ఈ సంస్థ ఆస్తుల జప్తు కోసం తదుపరి చర్యలు చేపట్టాలని సీఐడికి ఆదేశాలను జారీ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రిన్సిపల్ ప్రాఫిట్ బోత్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, వెహికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇలా అనేక పథకాల ద్వారా అధిక రిటర్న్లు చెల్లిస్తామని, భారీగా అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి శ్రేయ ఇన్ఫ్రా సంస్థ 8,128 మంది నుంచి రూ. 206 కోట్ల మేర డిపాజిట్లు సేకరించింది. గడువు తీరినప్పటికీ ఆ డబ్బు చెల్లించడంలో విఫలమైంది. బాధితుల నుంచి తీసుకున్న డబ్బుతో స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటికే కర్నూలులో ఈ సంస్థపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి చేరడంతో కేసులను సిఐడి కి బదిలీ చేసింది.
ఇక ప్రభుత్వ ఆదేశాలతో కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ సంస్థ పేరిట దాని ప్రతినిధులు హేమంత్ కుమార్ రాయ్, సంగీతరాయ్ లు 51.5 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో 3.12 కోట్ల విలువైన ఈ ఆస్తుల జప్తునకు చర్యలు చేపట్టింది. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిఐడికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై జిల్లా అధికారులు కూడా స్పందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ముందుకు వెళ్తామని రెవెన్యూ అధికారీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
