ప్రాణం తీశాడు.. పారిపోయాడు.. ఆమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హంతకుడెవరో తెలిస్తే!
న్యూయర్ రోజు అమెరికాలో హత్యకు గురైన భారతీయ యువతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మే హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31న నికిత హత్యకు గురైన తర్వాత ఆమె అర్జున్ ఆమె అకౌంట్ నుంచి 4వేల డాలర్‌లు ట్రాన్ఫర్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే జనవరి 2న నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందగా.. అర్జున్ కూడా అదే రోజు భారత్‌కు వచ్చేసినట్టు పోలీసులు తెలిపారు.

అమెరికాలో అర్జున్ శర్మపై ఫస్ట్ ,సెకండ్ డిగ్రీ మర్డర్ చార్జెస్ నమోదు చేశారు మేరీల్యాండ్ పోలీసులు. అతడిపై సెర్చ్ వారెంట్ కూడా జారీచేశారు. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల సమయంలో నికిత రావును అర్జున్ శర్మ చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రెండు రోజుల తర్వాత జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నికిత డిసెంబర్ 31న తన అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయిందని.. తర్వాత కనిపించపోయిందని చెప్పాడు. కాని.. అతడే నికితను హత్య చేసినట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అర్జున్ శర్మ ఫిర్యాదు చేసిన రోజే అమెరికా నుంచి భారత్ వచ్చేశాడు. పోలీసుల కాల్స్‌కు రెస్పాండ్ కాకపోవడం.. భారత్ వెళ్లిపోయాడని తెలియడంతో జనవరి 3న అతడి అపార్ట్‌మెంట్‌లో రెయిడ్ చేశారు. అక్కడే నికితరావు డెడ్‌బాడీని గుర్తించారు. ఆమె ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. అంతేకాదు.. నికిత మెయిల్స్ ఓపెన్ చేసి చూడగా.. చాలా విషయాలు బయటకు వచ్చాయి.
డిసెంబర్ 31న అమె చనిపోతే.. జనవరి 1న ఆమె అకౌంట్ నుంచి అర్జున్‌కు భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఒకసారి 3వేల డాలర్లు.. మరోసారి 395 డాలర్లు.. ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. ఇలా 4వేల డాలర్ల వరకు అతడు తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఇది భారత కరెన్సీలో మూడున్నర లక్షల వరకు విలువ ఉంటుంది.
నిజానికి నికిత అకడమిక్స్‌లో టాపర్. మంచి ఉద్యోగం భారీగా సంపాదన కూడా ఉంది. 2025 ఫిబ్రవరిలో ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన నికిత.. తక్కువ సమయంలోనే తన ప్రతిభతో కంపెనీలో ఇచ్చే ఆల్ ఇన్ అవార్డును దక్కించుకుంది. అమెరికాకు వెళ్లకముందు నికిత రావు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్‌గా పనిచేసింది. అనంతరం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ వర్సిటీలో మాస్టర్స్ పూర్తిచేసి.. ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఎలికాట్ సిటీలోని ఓ ఫార్మా కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా ఉద్యోగం చేస్తోంది.
అర్జున్ శర్మపై హత్యానేరం కింద కేసు పెట్టారు. భారత ఎంబసీ నికితరావు కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. అటు అర్జున్ శర్మ కోసం వేట ప్రారంభించింది. ఇంటర్‌పోల్‌తోపాటు.. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల సాయంతో.. అతడిని అమెరికాకు రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. అర్జున్ పాస్‌పోర్టు ప్రకారం అతడు చెన్నై వాసిగా తెలుస్తోంది. అయితే నికితను ఎందుకు చంపాడు? ఆర్ధిక లావాదేవీలే కారణమా? డిసెంబర్ 31న ఎలికాట్‌లోని అతడి అపార్ట్‌మెంట్లో ఏం జరిగింది అనేది అర్జున్ శర్మని విచారిస్తేగాని తేలదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
