Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder for Gold: ముక్కు పుడక, చెవిదిద్దులు కోసం వృద్ధురాలిని హతమార్చిన మానవ మృగాలు..!

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ముక్కు పుడక, చెవిదిద్దులు కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. ఆవులను మోపేందుకు పొలం వెళ్లింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుమారు ఎనిమిది గంటల సమయంలో చోడమ్మ అగ్రహారం నుండి కుమిలి వెళ్ళే దారిలో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది రాజమ్మ.

Murder for Gold: ముక్కు పుడక, చెవిదిద్దులు కోసం వృద్ధురాలిని హతమార్చిన మానవ మృగాలు..!
Woman Murder
Follow us
G Koteswara Rao

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 16, 2023 | 2:16 PM

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ముక్కు పుడక, చెవిదిద్దులు కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్యచేశారు గుర్తు తెలియని దుండగులు. పూసపాటిరేగ మండలం చల్లవాని తోట పంచాయితీ కొండగుడ్డిలో మహంతి రాజమ్మ అనే వృద్ధురాలు కుటుంబంతో నివాసం ఉంటుంది. రాజమ్మకి భర్త, నలుగురు కుమారులు ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రాజమ్మ ప్రతి రోజు పొలం పనులతో ఆవులు కాస్తూ.. జీవనం సాగిస్తుంది.

ఈ క్రమంలోనే రాజమ్మ ఎప్పటిలాగే తమ ఆవులను మోపేందుకు పొలం వెళ్లింది. అలా వెళ్లిన రాజమ్మ రాత్రి ఏడు అయినా ఇంటికి తిరిగి రాలేదు. రాజమ్మ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుమారు ఎనిమిది గంటల సమయంలో చోడమ్మ అగ్రహారం నుండి కుమిలి వెళ్ళే దారిలో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది రాజమ్మ. తల్లి పరిస్థితి చూసిన కుమారుడు గుండెలవిసేలా రోధించాడు. వెంటనే మిగతా కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చాడు. హుటాహటీన కుటుంబసభ్యులు, బంధువులు అంతా ఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రక్తపు మడుగులో ఉన్న రాజమ్మను చూసిన కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాజమ్మకు ముక్కు, చెవులు కర్కశంగా కోసి ముక్కుపుడక, చెవిదిద్దులు దొంగిలించినట్లు గమనించారు. అంతే కాకుండా శరీరం పై మూడు చోట్ల కత్తితో పొడిచిన గాట్లు ఉన్నాయి. శరీరమంతా రక్తసిక్తంగా ఉంది. ఒంటి పై బట్టలు కూడా చెల్లాచెదురై కనిపించాయి. జరిగిన ఘటనను పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబసభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఘటనాస్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాల కోసం ప్రయత్నించారు. దుండగులు వృద్ధురాలి పై దాడి చేసి ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం చేయగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం వల్లే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారాన్ని దొంగిలించే సమయంలో పెనుగులాట జరిగినట్లు పరిసరాలను పరిశీలించిన తరువాత నిర్ధారణకు వచ్చారు పోలీసులు.

అయితే రాజమ్మ పై జరిగిన దాడిలో ఒకరు పాల్గొన్నారా లేక మరికొందరు పాల్గొన్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వృద్ధురాలి పై జరిగిన దోపిడీ హత్య కేసు జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ హత్యతో ఒంటరిగా పొలం పనులకు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు మహిళలు. రాజమ్మ హత్య జరిగిన ప్రదేశం జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఈ హత్య స్థానికులు ఎవరైనా చేశారా? లేక అంతరాష్ట్ర దొంగలు చేసిన పనా? హత్య ఏ సమయంలో జరిగి ఉండొచ్చు? ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వృద్ధురాలి మరణంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్ననంటుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…