Aadhar Update: ఆధార్ అప్‌డేట్ చేసుకోనివాళ్లకు బ్యాడ్ న్యూస్! నేటి నుంచి ఛార్జీలు పెంపు!
నేటి నుంచి ఆధార్ అప్ డేట్ సర్వీస్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇకపై ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఆధార్ కార్డుని తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. దీనికై ఆధార్ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త మార్పుల్లో భాగంగా ఆధార్ అప్ డేట్ కు సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. ఈ కొత్త ఛార్జీలు సెప్టెంబర్ 30, 2028 వరకు చెల్లుబాటు అవుతాయి. సర్విస్ ను బట్టి ఛార్జెస్ లో మార్పులు ఉంటాయి. ఏయే సర్వీసులకు ఎంత ఛార్జీలు పెరిగాయంటే..
బయోమెట్రిక్ అప్‌డేట్
బయోమెట్రిక్ అప్ డేట్ అంటే.. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో వంటివి అప్ డేట్ చేసుకోవాలంటే 5 నుంచి 7 ఏళ్ల పిల్లలు ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైన 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు ఒకసారి ఫ్రీ. 7 నుంచి15 సంవత్సరాల వయస్సు పిల్లలకు సాధారణంగా రూ. 125 వసూలు చేస్తారు. కానీ, ఈ ఛార్జీని సెప్టెంబర్ 30, 2026 వరకు మాఫీ చేశారు.
డెమోగ్రాఫిక్ అప్‌డేట్స్
డెమోగ్రాఫిక్ అప్ డేట్స్ అంటే.. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ వంటివి. వీటిని విడిగా అప్ డేట్ చేస్తే రూ. 75 ఖర్చవుతుంది. గతంలో ఇది రూ. 50గా ఉండేది.
ఇ-కేవైసీ
మై ఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్ జూన్ 14, 2026 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. అదే నమోదు కేంద్రాలలో అయితే రూ.75 ఖర్చవుతుంది. గతంలో ఇది రూ.50 గా ఉండేది. అలాగే ఆధార్ ప్రింటవుట్ పొందడానికి రూ. 40 ఖర్చవుతుంది.
హోమ్ సర్వీస్
ఆధార్ సెంటర్లకు వెళ్లలేని వారికి ఇంటి వద్దకు వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. ఈ సర్వీస్ కు ఇప్పుడు ఛార్జీ వసూలు చేయబడుతుంది. ఒక హోమ్ సర్వీస్ కు రూ. 700 చెల్లించాలి. ఈ ఛార్జీ కేవలం ఇంటికొచ్చి సర్వీస్ అందిస్తున్నందుకు మాత్రమే. డెమోగ్రఫిక్ లేదా బయోమెట్రిక్ అప్‌డేట్స్‌కు సెపరేట్ గా ఛార్జీ కట్టాల్సి ఉంటుంది.
ఈ కొత్త రేట్లు అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2028 వరకు చెల్లుబాటు అవుతాయి. ఆధార్ హోల్డర్లు తమ వివరాలు అప్ డేట్ చేసుకునే ముందు ఈ పెరిగిన ఛార్జీలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




