Silver: దీపావళి తర్వాత వెండి ధరలు తగ్గుతాయా.. అసలు విషయం తెలిస్తే షాకే..
గత ఏడాదిలో వెండి ధరలు అసాధారణంగా పెరిగి కిలో రూ.2 లక్షలు దాటి ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఈ భారీ పెరుగుదలకు కారణం ఆభరణాల డిమాండ్ కాదు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పారిశ్రామిక డిమాండే. వెండి సరఫరాలో తీవ్ర లోటు ఏర్పడటంతో 2030 వరకు ఈ పెరుగుదల కొనసాగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఏడాది కాలంలో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఏడాది క్రితం కిలో రూ. 1,10,000 ఉన్న వెండి, ఇప్పుడు రూ. 1,70,000 కంటే ఎక్కువ ధర పలుకుతోంది. రెండు రోజుల క్రితం అయితే సౌత్ ఇండియాలో కిలో ధర ఏకంగా రూ. 2 లక్షలకు పైగా చేరి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వెండి ఈ గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ధంతేరాస్ తర్వాత ఒక రోజులో వెండి ధరలు రూ. 7,000 తగ్గినప్పటికీ.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం.. 2030 వరకు ఈ పెరుగుదల కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
పారిశ్రామిక డిమాండే కీలకం
గత సంవత్సరంతో పోలిస్తే వెండి 98శాతం పెరిగింది. ఇది 1980 లేదా 2011లో వినిపించిన ఊహాగానాలే లెక్కనే ఉండొచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే మోతీలాల్ వేదిక ఈసారి పరిస్థితి భిన్నమని స్పష్టం చేసింది. గతంలోలా కాకుండా నేటి వెండి పెరుగుదల కేవలం ఊహాజనిత స్పైక్‌లపై ఆధారపడకుండా వాస్తవ ప్రపంచ డిమాండ్‌పై ఆధారపడి ఉంది. అందులో సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అని చెప్పొచ్చు.
క్లీన్ ఎనర్జీ, ఈవీలదే ప్రధాన పాత్ర
నేడు వెండికి అతిపెద్ద కొనుగోలుదారు ఆభరణాల వ్యాపారి కాదు.. క్లీన్ ఎనర్జీ పరిశ్రమ
సౌర శక్తి: సౌర ఫోటోవోల్టాయిక్ (PV) రంగం ఒక్కటే ప్రపంచ వెండి ఉత్పత్తిలో దాదాపు 14-20శాతం లేదా ఏడాదికి 200 మిలియన్ ఔన్సులను వినియోగిస్తుంది. 2030 నాటికి ఇది 450 మిలియన్ ఔన్సులకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి గిగావాట్ సౌర సామర్థ్యానికి దాదాపు 500-600 కిలోల వెండి అవసరం.
ఈవీలు: ప్రతి ఎలక్ట్రిక్ వాహనం పెట్రోల్ కారు కంటే రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ వెండిని వినియోగిస్తుంది. 5G, ఏఐ, సెమీకండక్టర్ పరిశ్రమల పెరుగుతున్న డిమాండ్‌తో వెండి వినియోగం మరింత పెరుగుతోంది.
ప్రపంచ సరఫరాలో తీవ్ర లోటు
వెండికి డిమాండ్ పెరిగినా, మైనింగ్ ఉత్పత్తి స్థిరంగా ఉంది. ప్రపంచ వెండిలో 70-75శాతం రాగి, సీసం, జింక్ మైనింగ్‌ల ఉప ఉత్పత్తిగా వస్తుంది. 2024లో మొత్తం డిమాండ్ 35,000 టన్నులకు దగ్గరగా ఉండగా, సరఫరా కేవలం 3,600 టన్నుల లోటుతో ఉంది. ఇది దశాబ్దాలలో అతిపెద్దది కావడం గమనార్హం. ప్రపంచ నిల్వలు 2020 నుండి 30శాతం కంటే ఎక్కువ తగ్గాయి. ఈ వేగంతో 2027 నాటికి కనిపించే నిల్వలు 890 మిలియన్ ఔన్సులకు తగ్గుతాయని MOFSL అంచనా వేసింది.
పెట్టుబడిదారులకు లాభం
ధంతేరాస్ తర్వాత ధరలు తగ్గుతున్నప్పటికీ.. MOFSL నివేదిక ప్రకారం 2027 నాటికి వెండి ధర ఔన్సుకు 77డాలర్లుగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో భారతీయ పెట్టుబడిదారులకు ఈ పెరుగుదల మరింత లాభదాయకంగా మారుతుందని నివేదిక తెలిపింది. ఇన్వెస్టర్లకు కిలోకు రూ. 2.4-2.46 లక్షలు లేదా ప్రస్తుత స్థాయిల కంటే దాదాపు 30శాతం ఎక్కువ రాబడిని ఇస్తుంది.
వెండి ధరల్లో స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇది కేవలం తగ్గుదల కాదు, విరామం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంటే వెండి ధర ఇకపై చాలా ఎక్కువ స్థాయిలోనే స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీపావళి తర్వాత గణనీయంగా తగ్గే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




