Andhra: ఈ మొక్కలు నీటిని శుద్ధి చేస్తాయట.. ఇలా మీ చెరువులను సహజంగా క్లీన్ చేసుకోవచ్చు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కలుషిన నీటిని మనుషులు, జంతువులు ఉపయోగించడం వల్ల అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు “సస్టైనబుల్ ఫ్లోటింగ్ బెడ్స్ ఫర్ వాటర్ ప్యూరిఫికేషన్” అనే వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు.

ఆక్వా చెరువుల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో మంచి నీరు కలుషితం అవుతుంది. చేపలు, రొయ్యలు పెంచిన తరువాత ఆ నీటిని కాలువల్లో వదలటం వల్ల దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. కాలువల్లో పారే నీటిని జంతువులు, పక్షులు తాగటంతో పాటు మనుషులు తమ నిత్యావసరాలకు వినియోగిస్తారు. ఐతే ఈ కాలువలు ప్రస్తుతం కలుషితం అవుతున్నాయి. ఆ కాలువల్లో నీటిని గ్రామాల్లో వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దీంతో ఆ నీటిలోని హెవీ మెటల్స్, ఇతర వ్యర్థాల కారణంగా నీరు ఇబ్బందికరంగా మారుతుంది. ఆ నీరు చేరి గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లోని నీరు సైతం కలుషితం అయ్యి గ్రీన్ కలర్‌లోనికి మారుతున్నాయి. వీటిని ఫీల్టర్లు తొలగించలేవు. గ్రామాల్లో ప్రజలు ఈ నీటిని వినియోగించి అనారోగ్యాలకు, అలర్జీలకు గురవుతున్నారు. ఈ ప్రాణాంతకమైన ఈ సమస్యను గుర్తించారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని విద్యార్థులు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ వంశీ నాగరాజు నేతృత్వంలో కొందరు విద్యార్థులు ప్రయోగాలు చేసి వాటర్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ పద్ధతిని కనుగొన్నారు.
బ్యాంబో, కోకోనట్ ఫైబర్‌తో ఒక బెడ్ ఏర్పాటు చేసి దానిపై కెన్నా ఇండికా అనే మొక్కలను పెంచుతున్నారు. ఇవి పూలు పూచే మొక్కలు. అలా సస్టైనబుల్ ఫ్లూటింగ్ బెడ్స్ ఫర్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. వెదురు కర్రలు, కొబ్బరి పీచుతో రెండు ఫ్లోటింగ్ బెడ్స్ ఏర్పాటు చేశారు. మట్టికి బదులు గోని సంచులు అమర్చి రంద్రాలు చేశారు. వీటిపై కెన్నా ఇండికా పూల మొక్కలను పెంచుతున్నారు. వీటి వేళ్లు నీటిలోనికి వెళ్లి నీటిలో ఉన్న హెవీ మెటల్స్, ఇతర వ్యర్థాలను గ్రహిస్తాయి. కొన్ని రోజుల తర్వాత నీటిలో ఉండే ఆల్గే శాతం తగ్గి నీరు పరిశుభ్రమవుతుంది. ఈ విధానాన్ని ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాత మంచి ఫలితాలు వచ్చినట్టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ వంశీ నాగరాజు తెలిపారు. మొత్తంగా 80 శాతం వరకు నీటి కాలుష్యం తగ్గుతుందని అన్నారు. ప్రతి గ్రామంలోనూ చెరువులలో ఇటువంటి నాచురల్ రిలేటెడ్ వాటర్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల నీరు శుద్ధి అవుతుందని అంటున్నారు వంశీ నాగరాజు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




